Electric Vehicles : పెట్రోల్ మంటలకు చెక్.. క్లీన్ కార్ల వైపు ఇండియా నెక్స్ట్ స్టెప్
క్లీన్ కార్ల వైపు ఇండియా నెక్స్ట్ స్టెప్

Electric Vehicles : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఇంజన్ల శబ్దం కంటే నిశ్శబ్దంగా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ కార్లు, పొదుపుగా సాగే సిఎన్‌జి వాహనాల హడావిడే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు కేవలం మైలేజీ మాత్రమే చూసే వాహనదారులు, ఇప్పుడు పర్యావరణం, టెక్నాలజీని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫలితంగా, ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో క్లీన్ మొబిలిటీ వాహనాల అమ్మకాలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోయాయి. గత ఏడాది ఆటోమొబైల్ పరిశ్రమ సాధారణ వృద్ధి కంటే ఈ క్లీన్ కార్ల వృద్ధి రెట్టింపు వేగంతో సాగడం విశేషం. సమాజంలో మారుతున్న ఆలోచనా ధోరణికి ఇది నిదర్శనం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం వాహనాల అమ్మకాల్లో హైబ్రిడ్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఏకంగా 30 శాతానికి చేరింది. అంటే రోడ్డుపైకి వస్తున్న ప్రతి మూడు కొత్త కార్లలో ఒకటి క్లీన్ ఎనర్జీ వాహనమే అన్నమాట.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
31 మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.4 లక్షల క్లీన్ మొబిలిటీ కార్లు అమ్ముడయ్యాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 10.2 లక్షలు మాత్రమే. అంటే కేవలం ఏడాది కాలంలోనే అమ్మకాలు 31 శాతం పెరిగాయి. మొత్తం ఆటోమొబైల్ రంగం 13 శాతం వృద్ధిని నమోదు చేస్తే, ఈ విభాగం మాత్రం మూడు రెట్లు ఎక్కువ జోరు చూపించింది. గతేడాది మొత్తం కార్ల అమ్మకాలు 46.7 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
క్లీన్ వాహనాల వైపు అడుగులు
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు (అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ వివాదాలు) చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని అభద్రతా భావం సామాన్యుల్లో పెరిగింది. దీనికి తోడు మెట్రో నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ఆలోచనలో పడేసింది. ఈ పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్, సిఎన్‌జి వాహనాలే సరైన ప్రత్యామ్నాయమని దేశం భావిస్తోంది.
మౌలిక సదుపాయాల మెరుగుదల
ఒకప్పుడు ఎలక్ట్రిక్ కారు కొనాలంటే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలనే భయం ఉండేది. కానీ ఇప్పుడు హైవేల వెంట ఛార్జింగ్ స్టేషన్లు, నగరాల్లో ప్రతి మూల సిఎన్‌జి పంపులు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వెరసి వాహనదారులకు భరోసానిచ్చాయి. ఇదే ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం.
మార్కెట్ మొనగాళ్లు వీరే
క్లీన్ మొబిలిటీ రేసులో దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో రారాజుగా నిలిచింది. ఈ ఏడాది ఏకంగా 2 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ కార్ల మైలురాయిని దాటడం విశేషం. మరోవైపు, సిఎన్‌జి విభాగంలో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తన పోర్ట్‌ఫోలియోలోని దాదాపు అన్ని మోడళ్లలో సిఎన్‌జి ఆప్షన్ ఇస్తూ, గ్రాండ్ విటారా వంటి వాటిలో హైబ్రిడ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

