Electric Three Wheeler Sales : చైనాను వెనక్కి నెట్టి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మకాల్లో రికార్డుల మోత మోగించిన భారత్
త్రీ-వీలర్ అమ్మకాల్లో రికార్డుల మోత మోగించిన భారత్

Electric Three Wheeler Sales : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగంలో భారతదేశం తన సత్తాను చాటుతోంది. భారత్ వరుసగా రెండవ సంవత్సరం కూడా చైనాను వెనక్కి నెట్టి అత్యధికంగా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విక్రయించిన దేశంగా నిలిచింది. 2024 క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన త్రీ-వీలర్లలో 57 శాతం వాటా భారతదేశానిదే. ఈ ఘనత జీరో ఎమిషన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మకాల్లో భారత్ నంబర్ 1
ఆటోకార్ ప్రొఫెషనల్ నివేదిక ప్రకారం.. 2024 క్యాలెండర్ సంవత్సరంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల విక్రయాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనాను ఓడించడం భారత్‌కు ఇది వరుసగా రెండవసారి. 2024లో భారతదేశంలో దాదాపు 7 లక్షల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లు అమ్ముడయ్యాయి. ఇది 2023తో పోలిస్తే 18 శాతం అధికం. ఇదే సమయంలో చైనాలో కేవలం 3 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది 2023తో పోలిస్తే 6 శాతం తక్కువ.
ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది 1.21 మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లు అమ్ముడవ్వగా, అందులో ఒక్క భారతదేశం వాటానే 57 శాతం ఉండటం మన దేశంలో క్లీన్ మొబిలిటీ పెరుగుతున్న వేగాన్ని తెలియజేస్తుంది. భారత మార్కెట్‌లో 2025లో కూడా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల అమ్మకాలు అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఈ క్యాలెండర్ సంవత్సరంలో జనవరి 1 నుంచి నవంబర్ 20 వరకు ఇప్పటికే 6,80,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో ఏకంగా 70,604 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఇప్పటివరకు జరిగిన నెలవారీ విక్రయాలలో అత్యధికం.
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, 2025 సంవత్సరం ముగిసే నాటికి భారత్‌లో మొత్తం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల విక్రయాలు 7,40,000 నుంచి 7,50,000 యూనిట్లకు చేరే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లక్ష్యాన్ని చేరుకుంటే, త్రీ-వీలర్ విభాగంలో భారతదేశం ఒక చరిత్ర సృష్టించిన రికార్డును నమోదు చేస్తుంది.

