CNG Car: సీఎన్‌జీ కార్ వాడుతున్నారా? ఈ ఒక్క టెస్ట్ చేయించకపోతే ప్రాణాలకే ప్రమాదం
ప్రాణాలకే ప్రమాదం

CNG Car: మీరు సీఎన్‌జీ కార్ ఉపయోగిస్తున్నట్లయితే కేవలం ఇంజిన్ సర్వీసింగ్ చేయిస్తే సరిపోదు. సిలిండర్ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి నిర్ణీత సమయంలో హైడ్రో టెస్ట్ చేయించడం చాలా ముఖ్యం. టెస్టింగ్ చేయించకపోతే జరిగే ప్రమాదాలు, దీనికి ఎంత ఖర్చు అవుతుందో వివరంగా తెలుసుకుందాం. కార్లలో అమర్చే సీఎన్‌జీ సిలిండర్లలో ఇంధనం అత్యధిక ఒత్తిడి (ప్రెజర్) మధ్య నిల్వ ఉంటుంది. కొన్నేళ్ల పాటు నిరంతరం ఉపయోగించడం వల్ల సిలిండర్ లోపలి, వెలుపలి భాగాలు బలహీనపడే అవకాశం ఉంది. కాలక్రమేణా అందులో చిన్నపాటి లీకేజీలు లేదా తుప్పు పట్టడం వంటి సమస్యలు రావచ్చు. దీనివల్ల ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడుతుంది. అందుకే సిలిండర్ దృఢత్వాన్ని, పనితీరును నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా టెస్టులు చేయించడం ఎంతో అవసరం.
ఏమిటీ హైడ్రోస్టాటిక్ టెస్ట్?
ఈ పరీక్షలో నీరు, నియంత్రిత నీటి ఒత్తిడిని ఉపయోగించి సిలిండర్ ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలదో లేదో సరిచూస్తారు. అందుకే దీనిని హైడ్రోస్టాటిక్ టెస్ట్ అని పిలుస్తారు. నిపుణులు సిలిండర్‌ను వాహనం నుంచి తొలగించి, అధిక పీడనం వద్ద నీటిని నింపి దాని విస్తరణ సామర్థ్యాన్ని, బలహీనతలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరీక్షలో సిలిండర్ సురక్షితమని తేలితే దానికి సంబంధించి కొత్త ప్లేట్ లేదా మార్కింగ్ వేస్తారు. తద్వారా తదుపరి పరీక్ష ఎప్పుడు చేయించాలో సులభంగా తెలుస్తుంది.
ఎప్పుడు చేయించాలి? ఎక్కడ లభిస్తుంది?
ప్రతి సీఎన్‌జీ సిలిండర్‌పై మునుపటి పరీక్ష తేదీ, తదుపరి పరీక్షించాల్సిన గడువు స్పష్టంగా రాసి ఉంటుంది. ఈ తేదీ ముగిసే వరకు వేచి చూడకుండా ముందుగానే పరీక్ష చేయించడం శ్రేయస్కరం. ఈ ప్రాసెస్ సాధారణ రోడ్డు పక్కన ఉండే గ్యారేజీలలో చేయడం సాధ్యపడదు. ప్రభుత్వం నుంచి అధికారిక గుర్తింపు పొందిన సీఎన్‌జీ సిలిండర్ టెస్టింగ్ సెంటర్లలో మాత్రమే దీనిని చేయించాలి. కేంద్రానికి వెళ్లే ముందే అక్కడ సరైన అనుమతులు ఉన్నాయో లేదో సరిచూసుకోవడం మంచిది.
హైడ్రో టెస్ట్‌కు అయ్యే ఖర్చు ఎంత?
సిలిండర్ సైజు, వాహనం మోడల్, మీరు ఎంచుకునే టెస్టింగ్ సెంటర్‌ను బట్టి ఈ పరీక్ష ఖర్చు మారుతుంటుంది. సాధారణంగా మన దేశంలో సీఎన్‌జీ సిలిండర్ హైడ్రో టెస్ట్ కోసం రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ఖర్చవుతుంది. ఇది కేవలం కాగితాల కోసం చేసే ప్రక్రియ కాదు. వాహనంలో ప్రయాణించే వారి ప్రాణ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన భద్రతా చర్య.

