CNG Car: మీ కారులో సీఎన్జీ సిలిండర్ ఉందా?.. మూడేళ్లకోసారి ఈ టెస్ట్ చేయించకపోతే భారీ నష్టం
ఈ టెస్ట్ చేయించకపోతే భారీ నష్టం

CNG Car: సీఎన్జీ కారు నడిపేవారు కేవలం గ్యాస్ నింపుకోవడం, ఇంజిన్ సర్వీసింగ్ చేయించుకోవడంతోనే తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటారు. కానీ, కారులో ఉండే సీఎన్జీ సిలిండర్‌కు ప్రతి మూడేళ్లకోసారి హైడ్రో టెస్టింగ్ చేయించడం అత్యంత ముఖ్యం. ప్రతిసారి గ్యాస్ నింపినప్పుడు సిలిండర్ లోపల తీవ్రమైన ఒత్తిడి పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీనివల్ల కాలక్రమేణా సిలిండర్ లోహం బలహీనపడటంతో పాటు లోపల తేమ చేరి తుప్పు పట్టే ప్రమాదం ఉంది. బయటకు కనిపించని ఈ లోపాలను గుర్తించేందుకే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అయినా, బయట బిగించుకున్న కిట్ అయినా మూడేళ్లకోసారి పరీక్షించాలి. కారు కొన్న తేదీ కాకుండా, సిలిండర్ తయారైన తేదీని బట్టి ఈ గడువు మొదలవుతుంది. ప్రమాదం జరిగినా, సిలిండర్‌పై సొట్టలు పడినా గడువు కోసం చూడకుండా వెంటనే పరీక్ష చేయించాలి.
సిలిండర్ జీవితకాలం, టెస్టింగ్ ప్రక్రియ
ఒకసారి హైడ్రో టెస్టింగ్ పాసైన సిలిండర్‌ను మరో మూడేళ్ల పాటు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. సాధారణంగా ఒక ఆటోమోటివ్ సీఎన్జీ సిలిండర్ గరిష్ట జీవితకాలం తయారైన తేదీ నుంచి 20 ఏళ్ల వరకు ఉంటుంది. టెస్టింగ్ చేయించినంత మాత్రాన సిలిండర్ మొత్తం వయసు పెరగదని గుర్తుంచుకోవాలి. ఈ పరీక్షను కేవలం ప్రభుత్వం గుర్తించిన అధీకృత కేంద్రాల్లో మాత్రమే చేయించాలి. అక్కడ ముందుగా సిలిండర్లోని గ్యాస్‌ను సురక్షితంగా తొలగించి, కారు నుంచి వేరు చేస్తారు. తర్వాత సిలిండర్‌లో నీటిని నింపి, సాధారణం కంటే ఎక్కువ ఒత్తిడిని పంపి ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయా లేదా లోహం సాగుతోందా అని పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే సిలిండర్‌ను పూర్తిగా ఆరబెట్టి, వాల్వ్ తనిఖీ చేసి కొత్త గడువు తేదీని ముద్రిస్తారు.
టెస్టింగ్ ఖర్చు, కొత్త సిలిండర్ ధర
హైడ్రో టెస్టింగ్ కోసం అయ్యే ఖర్చు కారులోని సిలిండర్ల సంఖ్య, సీఎన్జీ సెటప్, టెస్టింగ్ కేంద్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ట్విన్-సిలిండర్ కార్లలో రెండు సిలిండర్లను పరీక్షించాల్సి ఉంటుంది కాబట్టి ఖర్చు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ సిలిండర్ వాల్వ్ పాడైతే దాన్ని మార్చడానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు మీ కారు సిలిండర్ హైడ్రో టెస్టులో ఫెయిల్ అయితే, దాన్ని మళ్లీ వాడటానికి వీలుండదు. దాని స్థానంలో కొత్త సిలిండర్ బిగించుకోవాల్సిందే. కొత్త సిలిండర్ కొనడానికి సుమారు 12,000 నుంచి 18,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. దీనికి ఫిట్టింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.
గడువు దాటితే ఇబ్బందులు, తేదీ తెలుసుకునే విధానం
సిలిండర్ టెస్టింగ్ గడువు ముగిసిపోతే సీఎన్జీ పంపుల వద్ద సిబ్బంది గ్యాస్ నింపడానికి నిరాకరిస్తారు. అంతేకాకుండా ట్రాఫిక్ తనిఖీల్లో పత్రాలు చూపించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. మీ కారు సిలిండర్ తదుపరి టెస్టింగ్ తేదీ ఎప్పుడో తెలుసుకోవడానికి, కారు ఫ్యూయల్ ఫ్లాప్ లేదా సీఎన్జీ నింపే చోట ఉండే మెటల్ ప్లేట్‌ను పరిశీలించండి. దానిపై గతంలో ఎప్పుడు టెస్ట్ చేశారు, మళ్లీ ఎప్పుడు చేయించాలనే వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఆ ప్లేట్ కనిపించకపోతే వెంటనే సీఎన్జీ కిట్ డీలర్ లేదా అధీకృత కేంద్రాన్ని సంప్రదించడం ఉత్తమం.

