CNG vs Hybrid vs EV : నేటి కాలంలో కారు కొనడం అనేది కేవలం ఒక హోదాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో మన నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేసే అతి పెద్ద నిర్ణయం. గతంలో మనకు కేవలం పెట్రోల్ లేదా డీజిల్ మధ్యే ఛాయిస్ ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లోకి సిఎన్‌జి, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు పోటీపడుతూ వస్తున్నాయి. అసలు సామాన్యుడికి ఏ కారు వల్ల ఎంత లాభం ఉంటుంది? కిలోమీటరుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం.

ముందుగా మిడిల్ క్లాస్ మిత్రుడిగా పేర్గాంచిన సిఎన్‌జి కార్ల గురించి మాట్లాడుకుంటే.. ఇవి పెట్రోల్ కంటే చాలా తక్కువ ధరకే ప్రయాణాన్ని అందిస్తాయి. సుమారు రూ.7 నుంచి రూ.12 లక్షల ధరలో లభించే ఈ కార్లు, కిలోమీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు ఖర్చు అవుతాయి. తక్కువ మెయింటెనెన్స్ ఉండటం వీటి ప్లస్ పాయింట్. అయితే, సిఎన్‌జి బంకుల వద్ద గంటల కొద్దీ లైన్లలో నిలబడాల్సి రావడం, కారు డిక్కీలో సిలిండర్ ఉండటం వల్ల సామాను పెట్టుకోవడానికి స్థలం లేకపోవడం దీని ప్రధాన లోపాలు.

ఇక హైబ్రిడ్ టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇది ఒక రకమైన మాయాజాలం అని చెప్పవచ్చు. ఇవి పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటి కలయికతో నడుస్తాయి. ట్రాఫిక్ లో లేదా తక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు కారు ఎలక్ట్రిక్ మోడ్ లో నడుస్తూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది. దీనికి విడిగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు, కారు నడుస్తున్నప్పుడే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. వీటి ధర రూ.12 నుంచి రూ.25 లక్షల వరకు ఉంటుంది. ఒక కిలోమీటరుకు సుమారు రూ.5 నుంచి రూ.8 వరకు ఖర్చు అవుతుంది. టెక్నాలజీ కాంప్లెక్స్ గా ఉండటం వల్ల మెయింటెనెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది.

చివరిగా ఎలక్ట్రిక్ వాహనాల గురించి చెప్పుకోవాలి. భవిష్యత్తు ప్రయాణం వీటిదే. ఎందుకంటే కిలోమీటరుకు అయ్యే ఖర్చులో ఈవీలను కొట్టే వాహనం మరొకటి లేదు. కేవలం రూ.1 నుంచి రూ.3 లోపే కిలోమీటర్ ప్రయాణం ముగుస్తుంది. వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. అయితే వీటి ధరలు రూ.15 నుంచి రూ.35 లక్షల వరకు భారీగా ఉంటాయి. ప్రస్తుతం ఛార్జింగ్ స్టేషన్లు అన్ని చోట్లా అందుబాటులో లేకపోవడం, కొన్ని ఏళ్ల తర్వాత బ్యాటరీ మార్చాల్సి వస్తే అయ్యే ఖర్చు దీనికి ఉన్న అతి పెద్ద ప్రతికూలతలు.

చివరగా ఏ కారు ఎవరికి బెస్ట్ అనే విషయానికి వస్తే.. మీరు నివసించే ప్రాంతంలో సిఎన్‌జి స్టేషన్లు పుష్కలంగా ఉండి, ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటే సిఎన్‌జి మంచిది. అలా కాకుండా సిటీలో లగ్జరీగా తిరగాలి, మైలేజ్ తో పాటు పవర్ కూడా కావాలనుకుంటే హైబ్రిడ్ సరైనది. కేవలం ఆఫీసు పనులకు, ఇంటి దగ్గరే ఛార్జింగ్ సదుపాయం ఉండి, అత్యంత తక్కువ రన్నింగ్ కాస్ట్ కావాలనుకునే వారికి ఎలక్ట్రిక్ కారు ఒక గొప్ప వరం. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన కారుని ఎంచుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story