Connected Cars : ఫ్రీ ఆఫర్ అయిపోగానే హ్యాండ్ ఇస్తున్న కార్ కస్టమర్లు.. ఆటో కంపెనీలకు సాఫ్ట్‌వేర్ తలనొప్పులు
ఆటో కంపెనీలకు సాఫ్ట్‌వేర్ తలనొప్పులు

Connected Cars : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కనెక్టెడ్ కార్ల హవా నడుస్తోంది. సరికొత్త సాంకేతికతతో ఇంటర్నెట్ సాయంతో నడిచే బోలెడన్ని స్మార్ట్ ఫీచర్లను కంపెనీలు కార్లలో అందిస్తున్నాయి. మొబైల్ ఫోన్ ద్వారానే కారును లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం, ఎక్కడో దూరంగా కూర్చుని కార్ ఏసీని ఆన్ చేయడం, లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడం వంటి ఫీచర్లు కొత్త కార్లలో సర్వసాధారణం అయిపోయాయి. సాధారణంగా కార్లు కొన్న కొత్తలో ఈ స్మార్ట్ సేవలను కంపెనీలు కొన్ని సంవత్సరాల పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తాయి. అయితే, ఈ ఉచిత కాలపరిమితి ముగిసిన తర్వాతే అసలు కథ మొదలవుతోంది.
మారుతి, టాటా, హ్యుందాయ్‌ల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఫ్లాప్?
వాహన తయారీ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి టాప్ బ్రాండ్లు తమ కనెక్టెడ్ కార్ల సాఫ్ట్‌వేర్ సేవలను ఒక ఏడాది నుండి గరిష్టంగా నాలుగు సంవత్సరాల వరకు ఉచితంగా ఇస్తాయి. ఆ తర్వాత కూడా ఈ ఫీచర్లు పని చేయాలంటే కస్టమర్లు నెలవారీ లేదా వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కార్ల అమ్మకాలతో పాటు ఈ సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా భారీగా డిజిటల్ ఆదాయాన్ని గడించాలని కంపెనీలు ప్లాన్ చేశాయి. కానీ, ఉచిత గడువు ముగియగానే చాలా తక్కువ మంది కస్టమర్లు మాత్రమే డబ్బులు కట్టి సేవలను కొనసాగిస్తున్నారు. దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ అంతర్గత లెక్కల ప్రకారం, భారత్‌లో ఆ కంపెనీకి చెందిన లక్షలాది కనెక్టెడ్ కార్లు తిరుగుతున్నప్పటికీ.. ఉచిత ఆఫర్ అయిపోయాక ప్రతి ఐదుగురిలో కేవలం ఒక్కరు మాత్రమే (20 శాతం) పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటున్నారు.
ఈవీ కార్లలో కనెక్టెడ్ యాప్స్ వాడకం ఎక్కువ
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగడంతో బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ తెలుసుకోవడం, ఛార్జింగ్ ఏ లెవెల్‌లో ఉందో చూసుకోవడం, రూట్ ప్లానింగ్ వంటి వాటి కోసం కస్టమర్లు ఈ డిజిటల్ యాప్స్ ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో కనెక్టెడ్ కార్లు ఉన్నప్పటికీ, భారతదేశంలో మాత్రం వీటికి డబ్బులు పెట్టడానికి జనం పెద్దగా ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు తమ ఉచిత ప్లాన్ అయిపోయాక ఎంతమంది డబ్బులు కడుతున్నారనే డేటాను అధికారికంగా బయటపెట్టడం లేదు. కానీ, లోపల జరుగుతున్న బిజినెస్ మాత్రం చాలా డల్‌గా ఉందనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త బిజినెస్ మోడల్‌కు గట్టి దెబ్బ
ఈ రకమైన స్మార్ట్ ఫీచర్లు కేవలం కలర్‌ఫుల్ ఆప్షన్లుగా మాత్రమే కాకుండా, ప్రతిరోజూ కచ్చితంగా వాడాల్సిన నిత్యావసరాలుగా మారితేనే కస్టమర్లు జేబుల నుండి డబ్బులు తీస్తారని ఆటో రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతదేశంలో ప్రజలు మొబైల్ రీఛార్జ్ కోసం, ఓటీటీ యాప్స్ కోసం ఈజీగా డబ్బులు ఖర్చు పెడతారు. కాబట్టి ఇక్కడ సమస్య డబ్బులు పెట్టడం కాదు, ఆ వస్తువు ఉపయోగం ఎంత ఉందనేదే ముఖ్యం. కార్ యాప్స్ ద్వారా లభించే ఫీచర్లు రోజువారీ జీవితంలో అంతగా అవసరం లేకపోవడం వల్లే కస్టమర్లు ఫ్రీ ఆఫర్ ముగియగానే యాప్‌లను పక్కన పడేస్తున్నారు. ఈ మైండ్ సెట్‌ను మార్చడం, వినియోగదారులకు మరింత ఉపయోగపడే ఫీచర్లను తీసుకురావడమే ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీల ముందున్న అతిపెద్ద సవాలు.

