Lamborghini :భారతీయ కుబేరుల కొత్త క్రేజ్.. అదిరిపోయే లాంబోర్గిని రెవూల్టో కస్టమైజ్డ్ కార్లు
అదిరిపోయే లాంబోర్గిని రెవూల్టో కస్టమైజ్డ్ కార్లు

Lamborghini : భారతదేశంలో కుబేరుల అభిరుచులు మారుతున్నాయి. ఇప్పుడు వారు కేవలం ఒక ఖరీదైన కారును కొని సరిపెట్టుకోవడం లేదు.. ఆ కారు తమ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మన దేశంలో కస్టమైజ్డ్ సూపర్ కార్ల ట్రెండ్ ఊపందుకుంటోంది. ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ కార్ల సంస్థ లాంబోర్గిని మన దేశంలో ఈ మార్పును స్పష్టంగా గమనిస్తోంది. తాజాగా భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లాంబోర్గిని రెవూల్టో సూపర్ కార్లను కంపెనీ డెలివరీ చేసింది.
ఒక లాంబోర్గిని కారును వేల రకాలుగా మార్చుకునే అవకాశాన్ని కంపెనీ తన యాడ్ పర్సోనం ప్రోగ్రామ్ ద్వారా కల్పిస్తోంది. కారు రంగు నుంచి మొదలుకొని, లోపల ఉండే సీట్ల కుట్టు, డ్యాష్ బోర్డ్ మీద ఉండే లోగోలు, కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ వరకు ప్రతిదీ కస్టమర్ తన ఇష్టానుసారం ఎంచుకోవచ్చు. దీనివల్ల ఒకే మోడల్ కారు అయినప్పటికీ, ప్రతి కస్టమర్ వద్ద ఉండే కారు రంగు, ఫీచర్లు వేరువేరుగా ఉండి పూర్తి 'యూనిక్' లుక్‌ను ఇస్తాయి.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల కస్టమర్లు ఒక్కో రకమైన అభిరుచిని ప్రదర్శిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఒక కస్టమర్ అజ్యూరో థెటిస్ అనే అరుదైన బ్లూ షేడ్ కారును ఎంచుకున్నారు. ఇందులో కార్బన్ ఫైబర్ రూఫ్, అద్భుతమైన సోనస్ ఫాబర్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఇక తూర్పు భారతదేశంలో కస్టమర్లు చాలా బోల్డ్ గా ఆలోచిస్తున్నారు. అక్కడ జియాల్లో ఆజ్ అనే బ్రైట్ ఎల్లో కలర్ కారు డెలివరీ అయింది. ముంబైలో అయితే మరీ వింతగా.. వెర్డే మెటాలిక్ రంగులో, బ్రాంజ్ మెరుపులతో కూడిన అదిరిపోయే రెవూల్టోను కంపెనీ డెలివరీ చేసింది.
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న సూపర్ కార్ల మార్కెట్‌గా మారుతోంది. కేవలం కారు ఇంజిన్ పవర్ మాత్రమే కాదు, కారు లోపల ఉండే ఏంబియంట్ లైటింగ్, స్పెషల్ లెదర్ వర్క్ వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా భారతీయులు రాజీ పడటం లేదు. వోల్వో, టాటా, మహీంద్రా వంటి కంపెనీలు కూడా తమ లగ్జరీ, ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడుతున్నప్పటికీ, లాంబోర్గిని వంటి సూపర్ కార్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తమ స్థాయిని, స్టైల్‌ను రోడ్డు మీద ప్రదర్శించడానికి కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదని ఈ డెలివరీలు నిరూపిస్తున్నాయి.

