Car Cyber Attacks : స్మార్ట్‌ఫోన్‌లలో ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లు వచ్చినట్లే ఇప్పుడు మన ఆధునిక కార్లలో కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు సర్వసాధారణమైపోయాయి. కొత్త ఫీచర్లు పొందడానికి లేదా చిన్నపాటి సాఫ్ట్‌వేర్ లోపాలను సరిచేసుకోవడానికి ఒకప్పుడు కార్లను నేరుగా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఓవర్ ది ఎయిర్ టెక్నాలజీ పుణ్యమా అని ఇంటి వద్దే, కేవలం ఇంటర్నెట్ ద్వారా కారు సాఫ్ట్‌వేర్‌ను కంపెనీలు అప్‌డేట్ చేస్తున్నాయి. అయితే ఈ సౌకర్యవంతమైన టెక్నాలజీతో కార్ల యజమానులకు సైబర్ సెక్యూరిటీ పరంగా తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని టెక్ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ఓవర్ ది ఎయిర్ టెక్నాలజీ అంటే ఏమిటి?

స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్, ఆపిల్, శామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పంపినట్లే.. కార్లలో కూడా ఇంటర్నెట్ ఆధారంగా కొత్త అప్‌డేట్స్ పంపే విధానాన్నే OTA టెక్నాలజీ అంటారు. టెస్లా సంస్థ 2012లోనే తన మోడల్ S కార్లలో మొదటిసారిగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కనెక్టెడ్ కార్లలో ఈ టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించాయి. దీనివల్ల కారు యజమానులకు సమయం, డబ్బు ఆదా అవ్వడంతో పాటు సర్వీస్ సెంటర్లకు వెళ్లే శ్రమ తగ్గుతుంది.

సైబర్ హ్యాకింగ్.. డేటా చోరీ ప్రమాదాలు

హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల దృష్టి ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఆధారిత కార్లపై పడింది. కారు సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉండటం వల్ల హ్యాకర్లు సులభంగా కారు డిజిటల్ సిస్టమ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్ల కారు యజమానుల వ్యక్తిగత డేటా చోరీకి గురవ్వడమే కాకుండా, కారులోని ప్రధాన కంట్రోల్ సిస్టమ్‌లను కూడా దుండగులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదముంది. రన్నింగ్‌లో ఉన్న కారు కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళితే అది దేశద్రోహుల చర్యలకు లేదా తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని సిఎన్‌బిసి నివేదిక స్పష్టం చేసింది.

అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చిన ఉదాహరణలు

గత ఏడాది నార్వే దేశంలో జరిపిన ఒక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ నడుస్తున్న ఒక బస్సు పవర్, బ్యాటరీ సిస్టమ్‌లను మొబైల్ నెట్‌వర్క్ ద్వారా దూరం నుంచే యాక్సెస్ చేయవచ్చని తేలింది. అంటే బస్సు తయారీ కంపెనీ లేదా హ్యాకర్లు తలుచుకుంటే మైళ్ల దూరంలో ఉన్న బస్సును ఒక్క క్లిక్‌తో ఆపేయగలరని నిరూపితమైంది. ఈ ఘటన తర్వాత బ్రిటన్, డెన్మార్క్ వంటి దేశాలు కూడా తమ వద్ద ఉన్న OTA టెక్నాలజీ కార్ల భద్రతపై సమగ్ర విచారణను ప్రారంభించాయి. రాబోయే రోజుల్లో కనెక్టెడ్ కార్లు పెరుగుతున్న కొద్దీ బలమైన సైబర్ సెక్యూరిటీ, కఠినమైన నిబంధనలు అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story