Maruti Suzuki: ధంతేరాస్ వేళ మారుతి సుజుకి సరికొత్త రికార్డు.. ఒకే రోజు ఏకంగా 30 వేల కార్ల డెలివరీ!
ఒకే రోజు ఏకంగా 30 వేల కార్ల డెలివరీ!

Maruti Suzuki: భారత ఆటోమొబైల్ రంగంలో మారుతి సుజుకి తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. శుభప్రదమైన ధంతేరాస్ పండుగ రోజున కంపెనీ రికార్డు స్థాయిలో దాదాపు 30,000 కార్లను కస్టమర్లకు అందించింది. ఈ పండుగ సీజన్లో కస్టమర్లు కొత్త కార్ల కొనుగోలుకు చూపించిన ఆసక్తి మారుతికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. గత ఏడాదితో పోలిస్తే సేల్స్ విపరీతంగా పెరగడం ఆటోమొబైల్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
17 శాతం పెరిగిన సేల్స్
సేల్స్ జోరు కేవలం ధంతేరాస్ రోజుకే పరిమితం కాలేదు. సెప్టెంబర్ 14న వచ్చిన గణేష్ చతుర్థి నుంచి నవంబర్ 6 నాటికి కంపెనీ దేశవ్యాప్తంగా ఏకంగా 4 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో 3.46 లక్షల యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి ఏకంగా 17 శాతం వృద్ధి నమోదైంది. ఈ ధనత్రయోదశి రోజున కస్టమర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందన మార్కెట్లోని అన్ని ఇతర బ్రాండ్లను వెనక్కి నెట్టేసింది.
కుప్పలుతెప్పలుగా బుకింగ్స్!
మారుతి సుజుకికి చెందిన రెండు అప్డేటెడ్ మోడల్స్ బలేనో, బ్రెజాలు కస్టమర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 5న మార్కెట్లోకి వచ్చిన బలేనో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటేసింది. మరోవైపు కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా అమ్మకాలు 70,000 యూనిట్లు దాటాయి. ఈ రెండు మోడళ్లకు సంబంధించిన పెండింగ్ బుకింగ్స్ ఇప్పటికీ భారీ సంఖ్యలో ఉన్నాయని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.
బ్రెజా సీఎన్జీ వర్షన్‌కే మొగ్గు
మారుతి బ్రెజా మోడల్లో లభించే వివిధ ఇంజిన్ వేరియంట్లకు కస్టమర్ల నుంచి విశేష ఆదరణ దక్కింది. మొత్తం బుకింగ్స్‌లో టర్బో ఇంజిన్ ఆప్షన్ 33 శాతం వాటా సాధించగా, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 26 శాతం వాటాను పొందింది. అయితే అండర్బాడీ సీఎన్జీ ఆప్షన్ ఏకంగా 41 శాతం బుకింగ్‌లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్జీ వేరియంట్ వైపే వాహనదారులు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
జీఎస్టీ తగ్గడంతో మారిన కథ
ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో 'ఏ' సెగ్మెంట్ చిన్న కార్ల అమ్మకాలు 31 శాతం మేర పెరిగాయి. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత ఈ కేటగిరీ కార్లకు డిమాండ్ మరింత పెరిగింది. మరోవైపు ఎస్యూవీ విభాగంలో మారుతి కార్ల అమ్మకాలు 33 శాతం వృద్ధి చెందాయి. ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు సరఫరా వేగవంతం కావడం, కొత్త స్టాక్ మార్కెట్లోకి త్వరగా రావడం వల్ల ఎస్యూవీ విక్రయాలు ఊపందుకున్నాయి. చిన్న కారు నుంచి లగ్జరీ ఎస్యూవీ వరకు మారుతి మోడళ్లు పండుగ సీజన్లో దుమ్మురేపాయి.

