EV PUC Challan : పోలీసుల అత్యుత్సాహం.. ఎలక్ట్రిక్ కారుకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని చలాన్
ఎలక్ట్రిక్ కారుకు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని చలాన్

EV PUC Challan : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్న కొద్దీ, వాటికి సంబంధించిన రూల్స్ పై ప్రజల్లోనే కాదు.. కొన్నిసార్లు అధికారుల్లో కూడా అవగాహన లోపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఒక వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పొగ కూడా రాని ఎలక్ట్రిక్ కారుకు కాలుష్య ధ్రువీకరణ పత్రం లేదంటూ పోలీసులు జరిమానా విధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏం జరిగిందంటే?:
రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన టాటా టియాగో ఈవీ కారులో వెళ్తుండగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కారును ఆపారు. మొదట ఆ కారు విండ్‌షీల్డ్‌కు ఎండ తగలకుండా సన్ షేడ్ పెట్టి ఉండటాన్ని అధికారి గుర్తించారు. దీనిపై కారు యజమానితో వాదన జరిగింది. సన్ షేడ్ పెట్టినందుకు రూ.200 చలాన్ రాసిన సదరు పోలీస్ అధికారి, అంతటితో ఆగకుండా కారు డాక్యుమెంట్లు చూపాలని అడిగారు.
అసలైన ట్విస్ట్ ఇక్కడే
కారు యజమాని పేపర్లు చూపిస్తున్న సమయంలో, పొల్యూషన్ సర్టిఫికెట్ ఎక్కడ అని ఏఎస్ఐ ప్రశ్నించారు. ఇది ఎలక్ట్రిక్ కారు అని, దీనికి పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేదని యజమాని ఎంత మొత్తుకున్నా అధికారి వినలేదు. చివరకు పీయూసీ లేదన్న కారణంతో రూ.1,500 జరిమానా విధిస్తూ చలాన్ చేతిలో పెట్టారు. ఈ తతంగం మొత్తాన్ని కారు యజమాని మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.
అసలు రూల్ ఏంటి?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం అవసరమా? అంటే.. ఖచ్చితంగా అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీతో నడుస్తాయి. వీటిలో పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్లు ఉండవు, కాబట్టి వీటి నుంచి ఎలాంటి పొగ వెలువడదు. కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, బ్యాటరీతో నడిచే వాహనాలకు పీయూసీ తనిఖీలు వర్తించవు. ఇవి జీరో ఎమిషన్ వాహనాలు కావడంతో వీటికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు.
అధికారుల వివరణ
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, పొరపాటున లేదా అవగాహన లేక వేసిన ఈ చలాన్‌ను సిస్టమ్ నుంచి రద్దు చేస్తామని తెలిపారు. ఏదేమైనా, ఈ ఘటన ఈవీ వాహనదారులకు ఒక కొత్త టెన్షన్‌ను పరిచయం చేసింది. అధికారులకు కూడా ఈవీ నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

