Car Mileage: కారు రెండు లక్షల కిలోమీటర్లు తిరిగితే అది ఇక పనికిరాదని, తుక్కు కింద లెక్క కట్టాలని చాలా మంది భావిస్తుంటారు. ఓడోమీటర్ మీద ఆ అంకె చూడగానే ఇంజిన్ ఎప్పుడైనా చేతులెత్తేస్తుందని, భారీగా ఖర్చు వస్తుందని కంగారు పడిపోతుంటారు. కానీ కేవలం కిలోమీటర్ల రీడింగ్ చూసి వాహనాన్ని పక్కన పెట్టేయడం సరైన పద్ధతి కాదని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందనే దానికంటే దానిని ఏ విధంగా మెయింటైన్ చేశారనేదే అత్యంత కీలకమైన అంశం.

క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేస్తే కారు సూపర్

సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చడం, చిన్న చిన్న సమస్యలను అప్పుడప్పుడు సరిచేయడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కార్లు రెండు లక్షల కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా చాలా సాఫీగా నడుస్తాయి. సరిగ్గా చూసుకున్న కార్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చాలా కాలం పాటు చక్కటి మైలేజ్ ఇస్తాయి. కాబట్టి కేవలం నంబర్లను నమ్మి మంచి కారును వదిలేయడం కంటే, దాని అసలు మెకానికల్ కండిషన్ ఎలా ఉందనేది పరిశీలించడం చాలా ముఖ్యం.

కారును ఎప్పుడు మార్చాలి?

మీ వాహనం తరచూ రిపేర్లకు వస్తుంటే, ప్రతిసారీ మెకానిక్ షెడ్డుకు వెళ్లాల్సి వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాలి. ఇంజిన్ నుంచి విచిత్రమైన శబ్దాలు రావడం, ఎక్కువ పొగ వస్తుండటం, గేర్లు మార్చేటప్పుడు ఇబ్బంది పడటం లాంటి లక్షణాలు కనిపిస్తే కారు వయసు అయిపోతుందని అర్థం చేసుకోవాలి. రిపేర్ల కోసం పెట్టే ఖర్చు కారు ప్రస్తుత విలువ కంటే ఎక్కువ అవుతుందనుకుంటే, ఇక కొత్త కారు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది.

ఖర్చులను బట్టి తుది నిర్ణయం

పాత వాహనానికి ప్రత్యామ్నాయంగా కొత్తది తీసుకోవాలని భావించినప్పుడు ఒకటికి రెండు సార్లు బేరీజు వేసుకోవాలి. రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చవుతుంది, ప్రస్తుతం ఆ మోడల్ రీసేల్ వాల్యూ ఎంత ఉందనేది బేరీజు వేయాలి. ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని, అనవసరమైన ఆర్థిక భారానికి దూరంగా ఉంటూ తగిన నిర్ణయం తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

Next Story