E20 Petrol: పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెరగడం వల్ల వాహనాల మైలేజ్ దారుణంగా పడిపోతోందంటూ దేశవ్యాప్తంగా బైకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాత బైకుల ఇంజన్లు పాడవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ అంశంపై దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ స్పందిస్తూ వాహనదారులకు క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే ఈ20 విధానాన్ని వేగంగా అమల్లోకి తెస్తోంది. ఇథనాల్ కేలరిఫిక్ విలువ పెట్రోల్ కంటే కాస్త తక్కువగా ఉండటం వల్ల మైలేజ్‌లో స్వల్ప తేడా రావడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. పాత వాహనాలు నడిపేవారు మైలేజ్ తగ్గుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. దేశ ఇంధన అవసరాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని హీరో మోటోకార్ప్ మద్దతు తెలిపింది.

మైలేజ్ స్వల్పంగా తగ్గినా, ఆ లోటును భర్తీ చేయడానికి టూ వీలర్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటి నయా టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కారు లేదా బైక్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. మళ్లీ క్లచ్ నొక్కగానే స్టార్ట్ అవుతుంది. దీనివల్ల అనవసరంగా ఇంధనం వృథా కాకుండా ఆదా అవుతుందని స్పష్టం చేసింది.

కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు తక్కువ రోలింగ్ రెసిస్టెన్స్ ఉన్న ప్రత్యేక టైర్లను వాహనాల్లో ఉపయోగిస్తున్నారు. ఇవి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తక్కువ రాపిడికి గురవుతాయి. దీనివల్ల ఇంజన్‌పై భారం తగ్గి తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంటుంది. టెక్నాలజీని నిరంతరం నవీకరించడం వల్ల ఇథనాల్ వాడకం వల్ల వచ్చే చిన్నపాటి తేడాలను వాహనదారులు గమనించలేరని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

కరోనా తదుపరి కాలం నుంచి ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. కస్టమర్ల కొనుగోలు శక్తి, ఇష్టాఇష్టాలు వేగంగా మారుతుండటంతో రాబోయే రోజుల్లో ఎలాంటి వాహనాలకు డిమాండ్ ఉంటుందో అంచనా వేయడం కంపెనీలకు సవాలుగా మారింది. రాబోయే కాలంలో మార్కెట్ వృద్ధి సానుకూలంగానే ఉన్నప్పటికీ కస్టమర్ ట్రెండ్స్‌కు అనుగుణంగా కొత్త టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడంపై ద్విచక్ర వాహన రంగాలు దృష్టి సారిస్తున్నాయి.

Next Story