Car AC Tips : రోహిణి కార్తె ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేసవి కాలంలో కారును కాసేపు ఎండలో పార్క్ చేస్తే చాలు.. అది కాస్తా నిప్పుల కొలిమిలా మారిపోతుంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే కారు లోపలి భాగం ఎంతలా వేడెక్కుతుందంటే.. కనీసం లోపల కాలు పెట్టడానికి కూడా భయం వేస్తుంది. ఇలాంటి సమయంలో చాలామంది చేసే ఒకే ఒక్క కామన్ మిస్టేక్ ఏంటంటే.. కారు ఎక్కిన వెంటనే ఏసీని ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేసేస్తారు. ఈ అలవాటు మనకు చాలా సాధారణంగా అనిపించినప్పటికీ.. దీనివల్ల ప్రాణాంతకమైన నష్టాలు ఉన్నాయని ఆటోమొబైల్, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎండలో ఎక్కువసేపు నిలిపి ఉంచిన కారులో ప్రమాదకరమైన గ్యాస్‌లు, వేడి గాలి పేరుకుపోతాయని.. వాటిని బయటకు పంపకుండా ఏసీ ఆన్ చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.

ప్లాస్టిక్ పార్ట్స్ నుంచి విషపూరిత వాయువులు

ఎండ తీవ్రతకు కారు లోపల ఉండే డ్యాష్‌బోర్డ్, సీట్లు, స్టీరింగ్, ఇతర ప్లాస్టిక్ విడిభాగాలు విపరీతంగా వేడెక్కుతాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్ కెమికల్స్ నుంచి బెంజీన్ వంటి క్యాన్సర్‌కు దారితీసే హానికరమైన, విషపూరితమైన వాయువులు కారు లోపల విడుదలవుతాయి. మనకు తెలియకుండానే ఆ గ్యాస్‌ను పీల్చడం వల్ల ఊపిరాడకపోవడం, గుండెల్లో మంట, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ గాలిని పీలిస్తే వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి కారు లోపల పేరుకుపోయిన ఆ విషపూరిత వేడి గాలిని బయటకు పంపించడం అత్యంత కీలకం.

వెంటనే ఏసీ ఆన్ చేయకండి

ఎండలో ఉన్న కారును తీసేటప్పుడు వెంటనే ఏసీ ఆన్ చేయడానికి బదులు.. కారు తలుపులు లేదా కిటికీలను కొన్ని సెకన్ల పాటు పూర్తిగా తెరిచి ఉంచాలి. వీలైతే ఒక వైపు డోర్ తెరిచి ఉంచి, మరోవైపు డోర్‌ను నాలుగైదు సార్లు గట్టిగా వేసి తీయడం వల్ల లోపల ఉన్న వేడి గాలి త్వరగా బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల కారు లోపలి ఉష్ణోగ్రత క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. వాతావరణం కాస్త చల్లబడిన తర్వాతే కిటికీలు మూసివేసి ఏసీని ఆన్ చేయాలి. ఈ చిన్న జాగ్రత్త వల్ల కారులో గాలి నాణ్యత మెరుగుపడటమే కాకుండా సురక్షితమైన ప్రయాణానికి వీలవుతుంది.

ఏసీని మొదట లో మోడ్‌లో రన్ చేయండి

కారు కిటికీలు తెరిచి వేడి గాలిని బయటకు పంపిన తర్వాత కూడా ఏసీని ఒకేసారి ఫుల్ స్పీడ్‌లో పెట్టకూడదు. ప్రారంభంలో ఏసీని తక్కువ మోడ్‌లో ఉంచి, కారును కొద్ది దూరం నడిపిన తర్వాత ఉష్ణోగ్రతను తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల కారులోని కూలింగ్ సిస్టమ్, కంప్రెసర్‌పై అకస్మాత్తుగా ఎలాంటి ఒత్తిడి పడదు. ఇది కారు ఇంజన్ లైఫ్‌ను పెంచడమే కాకుండా పెట్రోల్/డీజిల్ మైలేజ్‌ను కూడా ఆదా చేస్తుంది. ఏసీ సిస్టమ్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం మంచిది.

ఆరోగ్యానికి కూడా పెద్ద ముప్పే

కారులో ఏసీని వాడటం వల్ల కేవలం వాహనానికే కాదు, మన శరీరానికి కూడా సమస్యలు వస్తాయి. బయట విపరీతమైన ఎండ ఉండి.. కారులోపలికి రాగానే ఒక్కసారిగా ఫుల్ కూలింగ్ ఏసీ గాలిని శరీరంపై వేసుకోవడం వల్ల తీవ్రమైన తలనొప్పి, మైకం రావడం లేదా సడన్ షాక్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులను మన శరీరం తట్టుకోలేదు. అందుకే కారును ఎప్పుడూ వీలైనంత వరకు చెట్ల నీడలో లేదా ఇండోర్ పార్కింగ్‌లో ఉంచడానికి ప్రయత్నించాలి. అలాగే కారు అద్దాలకు సన్‌షేడ్స్ వాడటం, క్రమం తప్పకుండా ఏసీ సర్వీసింగ్ చేయించడం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story