ఈ బైకు ధరలో లగ్జరీ కారు కొనొచ్చు

Ducati : స్పీడ్, పవర్‌ను ప్రేమించే బైక్ లవర్లకు గుడ్ న్యూస్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన డుకాటి, తమ ఫ్లాగ్‌షిప్ నేకెడ్ మోడల్ అయిన 2025 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4, V4 S ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ సూపర్ నేకెడ్ మోటార్‌సైకిల్ ధర రూ.28.68 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అప్‌డేట్ చేసిన ఇంజిన్, మెరుగైన ఛాసిస్, సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్, పాత మోడల్‌ను రీప్లేస్ చేయనుంది.

డుకాటి తమ ఫ్లాగ్‌షిప్ నేకెడ్ మోటార్‌సైకిల్ కొత్త జనరేషన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2025 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4, మరింత ప్రీమియం అయిన V4 S మోడళ్లను లాంచ్ చేసింది. ఈ బైక్ పానిగాలె V4 సూపర్‌నేకెడ్ వెర్షన్‌గా కనిపిస్తుంది. ముందు భాగంలో ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, బై-ప్లేన్ వింగ్‌లెట్‌లు ఉన్నాయి. ఇవి పానిగాలె V4 లుక్ గుర్తుకు తెస్తాయి.

2025 స్ట్రీట్‌ఫైటర్ V4 ఇప్పుడు సరికొత్త ఇంజిన్ వేరియంట్‌తో వస్తుంది. ఇది పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఈ బైక్‌కు 1,103 సీసీ మోటోజీపీ వి-4 డెస్మోసెడిసి స్ట్రాడాలె ఇంజిన్ పవర్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 13,500 ఆర్‌పిఎమ్ వద్ద 213 బిహెచ్‌పీ, 11,250 ఆర్‌పిఎమ్ వద్ద 119 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది యూరో 5+ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో కౌంటర్-రొటేటింగ్ క్రాంక్‌షాఫ్ట్, ట్విన్-పల్స్ ఫైరింగ్ ఆర్డర్ కొనసాగుతాయి. అక్రాపోవిచ్ రేసింగ్ ఎగ్జాస్ట్ వాడితే పవర్‌ను 225 బిహెచ్‌పీ వరకు పెంచవచ్చు.

2025 మోడల్‌లో డుకాటి, పానిగాలె V4 స్ఫూర్తితో ఛాసిస్‌ను అప్‌డేట్ చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్త ఫ్రంట్ ఫ్రేమ్ తేలికగా, మరింత పటిష్టంగా ఉంటుంది. కొత్త డబుల్-సైడెడ్ డుకాటి హాలో సిమెట్రికల్ స్వింగ్‌ఆర్మ్ వాడటం వల్ల బరువు తగ్గడంతో పాటు మలుపుల్లో మంచి స్టెబిలిటీ లభిస్తుంది. ట్రీట్‌ఫైటర్ V4 లో పూర్తిస్థాయిలో అడ్జస్ట్ చేయగల షోవా ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో బ్రెంబో హైప్యూరే ఫ్రంట్ కాలిపర్స్ అమర్చారు. 17-అంగుళాల 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌పై పిరెల్లి డియాబ్లో రోస్సో IV కోర్సా టైర్లు ఉన్నాయి.

కొత్త స్ట్రీట్‌ఫైటర్‌లో రైడింగ్ అనుభవాన్ని పెంచడానికి అనేక అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. 6.9-అంగుళాల టీఎఫ్‌టీ డ్యాష్‌బోర్డ్ ఉంది, ఇది రోడ్, ట్రాక్ రైడింగ్‌ల కోసం రెండు డిస్‌ప్లే థీమ్‌లను అందిస్తుంది. ఇది టిపిఎంఎస్, లీన్ యాంగిల్, పవర్ డెలివరీ వంటి డేటాను కూడా చూపిస్తుంది. బ్రేకింగ్ కోసం బాష్‌తో అభివృద్ధి చేసిన రేస్ ఇ-సీబీఎస్ ఉంది. 2025 మోడల్‌లో పానిగాలె V4 R థ్రాటిల్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అలాగే, మెరుగైన గేర్ మార్పుల కోసం డుకాటి కొత్త తరం క్విక్‌షిఫ్టర్‌ను అమర్చారు. స్ట్రీట్‌ఫైటర్ V4 ధర రూ28.68 లక్షలు, స్ట్రీట్‌ఫైటర్ V4 S రూ.32.38 లక్షలలో లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story