మ్యాన్లీ లుక్ కావాలా? మోడరన్ స్టైల్ కావాలా?

Duster vs Hyryder : మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన రెనాల్ట్ డస్టర్ సరికొత్త హైబ్రిడ్ అవతారంలో మళ్లీ ఎంట్రీ ఇస్తుండగా, దానికి గట్టి పోటీ ఇచ్చేందుకు టయోటా హైరైడర్ సిద్ధంగా ఉంది. ఈ రెండు కార్లు కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో నడుస్తాయి. కానీ వీటి స్వభావం మాత్రం వేరు. అసలు ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్? దేని ఫీచర్లు అదిరిపోయాయి? కొనేముందు ఏ విషయాలు తెలుసుకోవాలో చూద్దాం.

కొత్త రెనాల్ట్ డస్టర్ చూడటానికి చాలా రగ్డ్‎గా ఉంటుంది. దీని బాక్సీ షేప్, ఎత్తైన బోనెట్, వెడల్పైన వీల్ ఆర్చెస్ దీనికి ఒక పక్కా ఆఫ్‌రోడర్ లుక్‌ను ఇస్తాయి. 4343 మిమీ పొడవు ఉన్న ఈ కారు దూరంగా ఉన్నా కూడా ఒక భారీ ఎస్‌యూవీలా కనిపిస్తుంది. ఇక టయోటా హైరైడర్ విషయానికి వస్తే, ఇది సిటీ రోడ్లపై స్టైలిష్‌గా కనిపించేలా డిజైన్ చేశారు. దీని స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ ఫినిషింగ్ చాలా ప్రీమియంగా ఉంటాయి. హైరైడర్ పొడవు (4365 మిమీ) డస్టర్ కంటే కొంచెం ఎక్కువే ఉన్నా, చూడటానికి మాత్రం డస్టర్ మరింత పవర్‌ఫుల్‌గా అనిపిస్తుంది.

ఇంటీరియర్, ఫీచర్ల జాతర

డస్టర్ లోపలి భాగం పూర్తిగా మారిపోయింది. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ మీటర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డస్టర్ క్యాబిన్ చాలా విశాలంగా ఉండి, లాంగ్ జర్నీలకు సెట్ అయ్యేలా ఉంటుంది. అటు హైరైడర్ లోపల ఫీచర్ల హోరు కనిపిస్తుంది. హెడ్-అప్ డిస్ప్లే (HUD), పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. టెక్నాలజీ పరంగా రెండు కార్లు పోటీపడుతున్నా, స్టోరేజ్, స్పేస్ విషయంలో డస్టర్ కాస్త ముందంజలో ఉంది.

సేఫ్టీ: ఎందులో గట్టితనం ఎక్కువ?

రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్‌సీ వంటి ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లు కామన్‌గా ఉన్నాయి. కానీ, కొత్త డస్టర్ ఒక అడుగు ముందుకు వేసి లెవల్-2 ADAS (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్) వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తోంది. హైరైడర్ కూడా సేఫ్టీలో వెనక్కి తగ్గకపోయినా, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్స్ డస్టర్‌కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ చేయాలనుకునే వారికి డస్టర్ సస్పెన్షన్ మరింత నమ్మకాన్ని ఇస్తుంది.

మైలేజ్ vs పర్ఫార్మెన్స్: ఏది బెస్ట్?

మీకు మైలేజ్ ముఖ్యమైతే టయోటా హైరైడర్ కళ్లు మూసుకుని తీసుకోవచ్చు. ఇది లీటరుకు ఏకంగా 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తూ ఎకానమీలో రికార్డులు సృష్టిస్తోంది. అదే మీకు పవర్, పిక్-అప్ కావాలంటే మాత్రం రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ సెటప్ అదిరిపోతుంది. ఇది హైరైడర్ కంటే ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. యాక్సిలరేషన్ కూడా చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. సిటీలో తిరుగుతూ మైలేజ్ కోరుకునే వారికి హైరైడర్, అప్పుడప్పుడు టూర్లకు వెళ్తూ పవర్ ఫుల్ డ్రైవింగ్ కోరుకునే వారికి డస్టర్ బెస్ట్ ఆప్షన్.

PolitEnt Media

PolitEnt Media

Next Story