BaaS Model Electric Cars : టాటా, మారుతి, ఎంజీ కార్లపై రూ.5 లక్షల వరకు ఆదా.. బాస్ ప్లాన్ అంటే ఏంటి?
బాస్ ప్లాన్ అంటే ఏంటి?

BaaS Model Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరుగుతున్నా, సామాన్యుడిని ఊరిస్తున్న ప్రధాన సమస్య వాటి ధర. పెట్రోల్ కార్ల కంటే ఈవీల ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం అందులో వాడే బ్యాటరీయే. కారు మొత్తం ధరలో బ్యాటరీ ఖర్చే సింహభాగం ఉంటుంది. ఈ సమస్యను చెక్ పెట్టేందుకు ప్రముఖ దిగ్గజాలు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ, టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా సంస్థలు సరికొత్త బాస్ మోడల్‌ను రంగంలోకి దించాయి. ఈ విధానంతో కారు కొనేటప్పుడు లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.
అసలు ఏంటో ఈ బాస్ మ్యాజిక్?
బాస్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు కారును కొంటారు కానీ బ్యాటరీని మాత్రం అద్దెకు తీసుకుంటారు. కారు ధర నుంచి బ్యాటరీ ఖర్చును కంపెనీలు మినహాయిస్తాయి. దీనివల్ల కారు ప్రారంభ ధర భారీగా తగ్గుతుంది. బ్యాటరీ వాడినందుకు గాను మీరు కిలోమీటరుకు ఇంత అని అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కారు కొనేటప్పుడు బడ్జెట్ భారం తగ్గుతుంది. ఒక రకంగా చెప్పాలంటే, పెట్రోల్ కొట్టినట్లుగానే మీరు తిరిగిన కిలోమీటర్లను బట్టి బ్యాటరీకి అద్దె కడితే సరిపోతుంది.
టాటా పంచ్ ఈవీ
టాటా మోటార్స్ తన పాపులర్ పంచ్ ఈవీ పై బాస్ ప్లాన్‌ను అమలు చేస్తోంది. ఈ కారు అసలు ధర సుమారు రూ.9.69 లక్షలు ఉండగా, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఎంచుకుంటే దీని ధర ఏకంగా రూ.3.20 లక్షల వరకు తగ్గుతుంది. అంటే మీరు చాలా తక్కువ ధరకే కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీనికి అద్దెగా కిలోమీటరుకు కేవలం రూ.2.6 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని బాస్ ప్లాన్లలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం విశేషం.
మారుతి సుజుకి ఈ-విటారా
మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారాలో కూడా ఈ బాస్ మోడల్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఇందులోని 49 kWh బ్యాటరీకి కిలోమీటరుకు రూ.3.99, 61 kWh బ్యాటరీకి రూ.4.39 అద్దెగా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా కారు కొనేటప్పుడు ఏకంగా రూ.5.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. మారుతి నమ్మకం, బాస్ ప్లాన్ తోడైతే ఈ కారు మార్కెట్లో దుమ్మురేపడం ఖాయం.
ఎంజీ మోటార్స్
బాస్ ప్లాన్‌ను భారత్‌లో మొదటగా పాపులర్ చేసింది ఎంజీ మోటార్సే. ఎంజీ విండ్సర్ ఈవీతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీలకు పాకింది. ఎంజీ కామెట్ ఈవీ పై రూ.2.64 లక్షల ఆదా లభిస్తుండగా, కిలోమీటరుకు రూ.3.2 అద్దె కట్టాలి. అదే ఎంజీ జెడ్ఎస్ ఈవీ విషయానికి వస్తే, కారు ధరపై ఏకంగా రూ.5.24 లక్షల భారీ తగ్గింపు లభిస్తుంది. దీనికి కిలోమీటరుకు రూ.4.5 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి ఏ ప్లాన్ బెటర్?
మీరు కారును ఎక్కువగా వాడకుండా, తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటే బాస్ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీ ప్రయాణం రోజుకు వందల కిలోమీటర్లు ఉంటే మాత్రం కిలోమీటరుకు కట్టే అద్దెను లెక్క వేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనా, బ్యాటరీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత బ్యాటరీల భయం లేకుండా, కంపెనీలే బాధ్యత తీసుకునే ఈ బాస్ మోడల్ భవిష్యత్తులో ఈవీ విప్లవానికి నాంది కానుంది.

