Electric Scooter : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి ఎప్పుడో పరుగులు పెడుతున్నాయి. అందుకే సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మళ్లింది. అయితే మార్కెట్లో వందల కంపెనీలు, రకరకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం లుక్ చూసో లేదా తక్కువ ధర అని ఆశపడ్డారో.. సరైన అవగాహన లేకుండా ఈ-స్కూటర్ కొంటే మాత్రం అది తెల్ల ఏనుగులా తయారవుతుంది. కొన్న తర్వాత రిపేర్లు వచ్చినా, రేంజ్ సరిగ్గా రాకపోయినా మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. అందుకే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఇవే

రేంజ్ విషయంలో మోసపోకండి

చాలా కంపెనీలు తమ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వస్తుందని చెబతాయి. కానీ ఇది ఐడీసీ లేదా ఏఆర్ఏఐ లెక్కలు మాత్రమే. అంటే అన్నీ అనుకూల పరిస్థితుల్లో వచ్చే మైలేజ్ అన్నమాట. నిజమైన రోడ్ల మీద ట్రాఫిక్, ఇద్దరు వ్యక్తులు ఎక్కినప్పుడు వచ్చే రియల్ వరల్డ్ రేంజ్ దీనికంటే 20-30 శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి కంపెనీ చెప్పే మాటల కంటే, రియల్ రేంజ్ ఎంత వస్తుందో తెలుసుకుని, మీ రోజువారీ ప్రయాణం కంటే కనీసం 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా రేంజ్ ఇచ్చే స్కూటర్ ను ఎంచుకోవడం ఉత్తమం.

బ్యాటరీ క్వాలిటీ, వారంటీ

ఎలక్ట్రిక్ స్కూటర్ లో అత్యంత ఖరీదైన భాగం బ్యాటరీ. మొత్తం కారు లేదా స్కూటర్ ధరలో సగం కంటే ఎక్కువ దీనికే ఖర్చవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ లిథియం-అయాన్ లేదా ఎల్‌ఎఫ్‌పి బ్యాటరీ ఉన్న స్కూటర్లనే ఎంచుకోండి. లోకల్ కంపెనీలు తక్కువ ధరకే లెడ్-యాసిడ్ బ్యాటరీలతో స్కూటర్లను అమ్ముతుంటాయి, ఇవి ఏడాది తిరగకముందే పాడైపోతాయి. బ్యాటరీపై కనీసం 3 నుంచి 5 ఏళ్ల వరకు వారంటీ ఉందో లేదో సరిచూసుకోండి. అలాగే బ్యాటరీని తీసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉంటే అపార్ట్మెంట్లలో ఉండేవారికి చాలా సౌకర్యంగా ఉంటుంది.

మోటార్ పవర్, బిల్డ్ క్వాలిటీ

స్కూటర్ ఎంత వేగంగా వెళ్తుంది, ఎంత బరువు మోస్తుంది అనేది అందులోని మోటార్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఎత్తైన ప్రాంతాల్లో (ఫ్లై ఓవర్లు లేదా ఘాట్ రోడ్లు) ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తే, కనీసం 3kW లేదా అంతకంటే ఎక్కువ పీక్ పవర్ ఉన్న మోటార్ అవసరం. అలాగే కేవలం ప్లాస్టిక్ బాడీని చూసి మోసపోకండి. స్కూటర్ ఫ్రేమ్ ఎంత దృఢంగా ఉందో చూడండి. మంచి సస్పెన్షన్, డిస్క్ బ్రేక్లు ఉంటేనే మన రోడ్ల మీద ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.

సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది?

కొత్త కంపెనీలు చాలా వరకు స్కూటర్లని ఆన్లైన్ లో అమ్ముతున్నాయి కానీ వాటికి ఊరిలో సర్వీస్ సెంటర్లు ఉండవు. ఒకవేళ స్కూటర్ ఆగిపోతే ఎవరికి ఫోన్ చేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. మీ ఇంటికి దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందా? విడిభాగాలు సులభంగా దొరుకుతాయా? అన్నది చాలా ముఖ్యం. టీవీఎస్, బజాజ్, ఓలా, ఏథర్ వంటి బ్రాండ్లకు ఇప్పుడు సర్వీస్ నెట్వర్క్ పెరుగుతోంది, కాబట్టి లోకల్ బ్రాండ్ల కంటే వీటిపై మొగ్గు చూపడం మంచిది.

ఛార్జింగ్ టైమ్, స్మార్ట్ ఫీచర్లు

ఆఫీసు నుంచి వచ్చాక స్కూటర్ ఛార్జింగ్ పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉందా? అన్నది గమనించాలి. గంటలో 80 శాతం ఛార్జ్ అయ్యే స్కూటర్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. వీటికి తోడుగా యాంటీ-థెఫ్ట్ అలారం, జియో ఫెన్సింగ్, బ్లూటూత్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉంటే మీ ప్రయాణం మరింత స్మార్ట్ గా మారుతుంది. అయితే ఈ ఫీచర్ల కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారో లేదో కూడా చూసుకోవాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story