Tesla: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఎలక్ట్రిక్ పికప్ వాహనం 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు టెస్లా సంస్థ పెద్ద నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో 2027 మధ్య నాటికి ఈ కార్ల తయారీ పూర్తిగా బంద్ కానుంది. సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఉత్పత్తి ప్రారంభమైన కేవలం మూడు సంవత్సరాలలోపే ఒక పాపులర్ మోడల్‌ను పక్కన పెట్టడం ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

దారుణంగా పడిపోయిన విక్రయాలు!

2019లో కాన్సెప్ట్ మోడల్‌గా మార్కెట్‌కు పరిచయమైన సైబర్ ట్రక్, రకరకాల ఆలస్యాల తర్వాత 2023లో కస్టమర్ల చేతికి వచ్చింది. అయితే మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీని డిమాండ్ ఊహించని విధంగా పడిపోయింది. ఎలాన్ మాస్క్ ఏడాదికి కనీసం 2.5 లక్షల యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంటే, ఇప్పటివరకు కేవలం 63,000 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. తొలినాళ్లలో ప్రకటించిన ధర కంటే లాంచ్ సమయంలో ధర చాలా ఎక్కువగా ఉండటం కూడా సేల్స్ తగ్గడానికి ప్రధాన కారణమైంది.

సమస్యగా మారిన డిజైన్!

సైబర్ ట్రక్ ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు దాని భద్రతే. దీని విలక్షణమైన పదునైన డిజైన్, వాడిన స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ యూరప్ ఖండంలోని కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. దీంతో యూరప్ మార్కెట్లో దీనిని అసలు లాంచ్ చేయడానికే వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియాలలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

సైబర్ ట్రక్ స్థానంలో రాబోతున్న సైబర్ క్యాబ్

సైబర్ ట్రక్ ఉత్పత్తి నిలిపివేత ద్వారా ఫ్యాక్టరీలో ఖాళీ అయ్యే స్థలాన్ని సరికొత్త సైబర్ క్యాబ్ తయారీకి ఉపయోగించాలని టెస్లా భావిస్తోంది. ఈ డ్రైవర్‌లెస్ రోబోట్ టాక్సీలో స్టీరింగ్ వీల్, పెడల్స్, వెనుక విండ్‌షీల్డ్ వంటివి ఏవీ ఉండవు. సీతాకోకచిలుక రెక్కల తరహాలో తెరుచుకునే బటర్‌ఫ్లై డోర్స్‌తో రానున్న ఈ ఎలక్ట్రిక్ టాక్సీని రైడ్-హెయిలింగ్ సేవల్లో పెద్ద ఎత్తున వాడేందుకు టెస్లా ప్లాన్ చేస్తోంది.

భవిష్యత్తులో టెస్లా నుంచి రాబోయే కార్లు ఇవే

గతంలో మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ ఉత్పత్తిని తగ్గించిన టెస్లా, సైబర్ ట్రక్‌ను కూడా నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్లో కేవలం మోడల్ 3, మోడల్ వై మాత్రమే పూర్తిస్థాయి మోడల్స్‌గా మిగులుతాయి. 2028 నాటికి కొత్త తరం రోడ్‌స్టర్ డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే సామాన్యులకు అందుబాటులో ఉండే ఒక చిన్న సరసమైన ఎలక్ట్రిక్ కారు రూపకల్పనపై కూడా కంపెనీ పనిచేస్తోంది.

Next Story