Elon Musk : ఎలాన్ మస్క్‌కు మరో షాక్.. టెస్లాకు రూ.2 వేల కోట్ల జరిమానా
టెస్లాకు రూ.2 వేల కోట్ల జరిమానా

Elon Musk : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ఈ మధ్య అంతగా కలిసి రావడం లేదు. మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కంపెనీ టెస్లాకు రూ.2 వేల కోట్ల జరిమానా పడింది. అమెరికాలో జరిగిన ఒక కారు ప్రమాదం కేసులో బాధిత కుటుంబానికి 243 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2 వేల కోట్లు) చెల్లించాలని జ్యూరీ టెస్లాను ఆదేశించింది. 2019లో జరిగిన ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి మరణించింది. ఈ కేసులో తీర్పు వచ్చింది. దీంతో టెస్లా జరిమానా కట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష పదవి విషయంలో ట్రంప్‌తో విభేదాల తర్వాత, ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త పార్టీని స్థాపించారు. ఆయన కంపెనీ టెస్లా షేర్లు కూడా భారీగా పడిపోయాయి. గత శుక్రవారం కూడా కంపెనీ షేర్లు దాదాపు 5% పడిపోయాయి. ఇప్పుడు ఈ భారీ జరిమానా కూడా తోడైంది.
2019లో టెస్లా కారులో ఉన్న డ్రైవర్ అసిస్టెంట్ టెక్నాలజీలో లోపం కారణంగా ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి నబెల్ బెనావిడెస్ లియోన్ మరణించింది. ఆమె ప్రియుడు డిలాన్ ఎంగులో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు కారు డ్రైవర్ తన ఫోన్‌పై దృష్టి పెట్టడం వల్ల కారుపై కంట్రోల్ కోల్పోయానని చెప్పాడు. అయితే, టెస్లా ఒక ఆటో-పైలట్ కారు కాబట్టి ఈ ప్రమాదానికి టెస్లా కంపెనీ కూడా బాధ్యులే అని జ్యూరీ భావించింది. దీంతో కంపెనీకి వేల కోట్ల రూపాయల జరిమానా విధించింది.
ఈ కేసులో డ్రైవర్ ఎవరైనా అయి ఉండవచ్చు.. కానీ ఈ ఘటనకు కంపెనీ నైతిక బాధ్యత వహించాలని జ్యూరీ తన తీర్పులో నొక్కి చెప్పింది. ఎందుకంటే, టెస్లా తన కారు ఒక ఆటో-పైలట్ కారు అని, డ్రైవర్ లేకుండా కూడా నడవగలదని ప్రచారం చేసుకుంది. టెస్లా ఆటో-పైలట్ సిస్టమ్‌లో గతంలో కూడా కొన్ని లోపాలు వచ్చాయి.. కానీ అవి ఇంత పెద్దవి కాకపోవడంతో వెలుగులోకి రాలేదు. ఈ కేసులో కారు యజమాని మరియు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నా, 'ఆటో-పైలట్' ఫీచర్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా జ్యూరీ టెస్లాపై కూడా బాధ్యత మోపింది. ఇది భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీని తయారు చేసే కంపెనీలకు ఒక హెచ్చరికగా నిలిచిందని నిపుణులు అంటున్నారు.
