Tesla : టెస్లా షాకింగ్ నిర్ణయం.. మోడల్ S, మోడల్ X కార్లకు గుడ్ బై
మోడల్ S, మోడల్ X కార్లకు గుడ్ బై

Tesla : ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెండు ఐకానిక్ మోడళ్లకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. టెస్లాను గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన మోడల్ S, మోడల్ X కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలో సంచలనం సృష్టించిన ఈ కార్ల ప్రయాణం ముగియనుండటం ఆటోమొబైల్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఈ సంస్థ తన భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా మార్చేస్తోంది. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చే త్రైమాసికం నుంచి మోడల్ S సెడాన్, మోడల్ X ఎస్‌యూవీల ఉత్పత్తిని క్రమంగా తగ్గించి, పూర్తిగా నిలిపివేయనుంది. ఈ కార్లు లేకుండా టెస్లా ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదని, ప్రారంభంలో తమను ఆదరించిన కస్టమర్లకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. అయితే భవిష్యత్తులో కేవలం స్వయంప్రతిపత్తి కలిగిన వాహనాలపైనే దృష్టి సారించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం తగ్గుతున్న అమ్మకాలు, పెరుగుతున్న తయారీ ఖర్చులు. టెస్లా విక్రయించే మొత్తం కార్లలో మోడల్ 3, మోడల్ Yల వాటా 90 శాతం కంటే ఎక్కువగా ఉంది. వాటితో పోలిస్తే మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్ల ధరలు చాలా ఎక్కువ. అలాగే ఇతర కంపెనీల నుండి వస్తున్న పోటీ వల్ల ఈ ఖరీదైన మోడళ్లను కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదు. లాభాలు లేని మోడళ్లపై పెట్టుబడి పెట్టడం కంటే, సామాన్యులకు అందుబాటులో ఉండే మాస్-మార్కెట్ ఈవీలపై దృష్టి పెట్టడం మేలని టెస్లా భావిస్తోంది.
టెస్లా మోడల్ S కారు ఎలక్ట్రిక్ సెడాన్లలో ఒక సంచలనం. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 650 కిలోమీటర్ల రేంజ్‌ను ఇచ్చేది. కేవలం 3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం దీని సొంతం. ఇక మోడల్ X విషయానికి వస్తే, ఇది ఒక లగ్జరీ 7-సీటర్ ఎస్‌యూవీ. దీని ప్రత్యేకత ఫాల్కన్-వింగ్ డోర్స్ (పైకి తెరుచుకునే తలుపులు). 580 కిలోమీటర్ల రేంజ్, అద్భుతమైన ఏడబ్ల్యుడి (AWD) సిస్టమ్ దీనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇప్పుడు ఈ రెండు మోడళ్లు కనుమరుగు కానుండటం టెక్ ప్రియులకు తీరని లోటే.
ప్రస్తుతం ఆర్డర్ చేసిన కస్టమర్లకు వాహనాలను డెలివరీ చేసిన తర్వాత టెస్లా వీటి ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఈ ఐకానిక్ కార్లను సొంతం చేసుకోవాలని ఉంటే ఇదే ఆఖరి అవకాశం అని కంపెనీ సూచించింది. ఇక నుంచి టెస్లా తన పూర్తి ఫోకస్‌ను కొత్త తరం ప్లాట్‌ఫామ్స్, తక్కువ ధర ఈవీలు, రోబోటాక్సీల వైపు మళ్లించనుంది. దీనివల్ల కంపెనీ ఆదాయం పెరగడమే కాకుండా, మార్కెట్లో తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చని ఎలన్ మస్క్ భావిస్తున్నారు.

