REEV Technology : ఛార్జింగ్ టెన్షన్ గాయబ్..పెట్రోల్ ప్లస్ ఈవీ కాంబోతో సరికొత్త REEV టెక్నాలజీ.. అసలు కథ ఇదే
అసలు కథ ఇదే

REEV Technology : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వాడకం వేగంగా పెరుగుతోంది. మనదేశంలో కూడా నగరాల్లో చాలామంది బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, చాలామంది ఈవీలు అనగానే వెనుకంజ వేయడానికి ప్రధాన కారణం రేంజ్ యాంగ్జైటీ. అంటే ప్రయాణంలో దారి మధ్యలో ఎక్కడైనా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే పరిస్థితి ఏంటి? అనే భయం. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్‌లు వెళ్లేటప్పుడు ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ మార్కెట్లోకి REEV (రేంజ్ ఎక్స్టెండర్ ఎలక్ట్రిక్ వెహికల్) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇది భవిష్యత్తులో ఈవీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
అసలు ఏంటి ఈ REEV టెక్నాలజీ?
REEV అంటే రేంజ్-ఎక్స్టెండర్ ఎలక్ట్రిక్ వెహికల్. సాధారణంగా మనం చూసే హైబ్రిడ్ లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లకు, ఈ REEV కార్లకు చాలా తేడా ఉంటుంది. హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ నేరుగా కారు టైర్లను తిప్పుతాయి. కానీ REEV లో కారు ఎల్లప్పుడూ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారానే నడుస్తుంది. ఇందులో ఉండే చిన్న పెట్రోల్ ఇంజిన్ కారు టైర్లను ఎప్పుడూ నడపదు. దాని పని కేవలం కరెంట్ తయారు చేయడమే. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గినప్పుడు, ఈ చిన్న పెట్రోల్ ఇంజిన్ ఆన్ అయ్యి కరెంట్‌ను ఉత్పత్తి చేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అంటే కారు ఎలక్ట్రిక్ వాహనంగానే నడుస్తుంది కానీ ప్రయాణం మధ్యలో ఆగదు.
భారతదేశానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ ఎందుకు?
మనదేశంలో ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, దూరప్రాంతాలకు వెళ్లే హైవేలపై ఇప్పటికీ సరిపడా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో REEV టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుంది. లాంగ్ ప్రయాణాల్లో బ్యాటరీ ఛార్జ్ అయిపోతే, గంటల తరబడి ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతకాల్సిన అవసరం లేదు. దగ్గరలోని పెట్రోల్ బంక్‌కి వెళ్లి కాస్త పెట్రోల్ కొట్టిస్తే చాలు, ఆ ఇంజిన్ ద్వారా కారే స్వయంగా కరెంట్ తయారు చేసుకుని ముందుకు సాగుతుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ప్రయాణం ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతుంది.
చిన్న బ్యాటరీ.. చాలా తక్కువ ధర
సాధారణ ఎలక్ట్రిక్ కార్లలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి 50 నుంచి 80 kWh వరకు ఉండే పెద్ద పెద్ద బ్యాటరీలను వాడతారు. ఈ బ్యాటరీల వల్లే ఈవీ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే REEV కార్లలో అంత పెద్ద బ్యాటరీల అవసరం ఉండదు. ఇందులో కేవలం 15 నుంచి 30 kWh సామర్థ్యం గల చిన్న బ్యాటరీ సరిపోతుంది. అవసరమైనప్పుడు పెట్రోల్ ఇంజిన్ కరెంట్ ఇస్తుంది కాబట్టి, పెద్ద బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల కారు తయారీ ఖర్చు తగ్గి, సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలోనే REEV కార్లు లభించే అవకాశం ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్‌లో హల్‌చల్
REEV టెక్నాలజీ అనేది కేవలం ఒక ప్రయోగం మాత్రమే కాదు. ఇప్పటికే గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజాలు ఈ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు నిస్సాన్ కంపెనీ తీసుకొచ్చిన 'e-Power' టెక్నాలజీ ఇప్పటికే అనేక దేశాల్లో సూపర్ హిట్ అయింది. దీనితో పాటు హ్యుందాయ్, స్టెల్లాంటిస్, చైనాకు చెందిన లీ ఆటో వంటి ప్రముఖ కంపెనీలు కూడా REEV మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. భారతదేశంలో ఒకే కారుతో సిటీ డ్రైవింగ్, లాంగ్ ట్రిప్స్ రెండూ మేనేజ్ చేయాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఈ REEV కార్లు ఒక గొప్ప వరంగా మారనున్నాయి.

