Electric Cars : ఈవీలకు ఇక 'జీరో ఎమిషన్' హోదా ఉండదా? విద్యుత్ ఖర్చుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు
విద్యుత్ ఖర్చుపై ప్రభుత్వం కొత్త నిబంధనలు

Electric Cars : ఎలక్ట్రిక్ కార్లు అంటేనే కాలుష్యం లేని వాహనాలు.. వీటికి జీరో ఎమిషన్ ట్యాగ్ ఉంటుంది. కానీ భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కొత్త ఫ్యూయల్ ఎఫిషియన్సీ నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న ఈ జీరో ఎమిషన్ హోదాను తొలగించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, కార్ల తయారీ కంపెనీలు తమ ఈవీలను కేవలం ఎలక్ట్రిక్ మోటార్లతో తయారు చేస్తే సరిపోదు, అవి ఎంత తక్కువ విద్యుత్తును వాడుకుంటున్నాయో కూడా నిరూపించుకోవాలి. అంటే పెట్రోల్ కారు లీటరుకు ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందో, ఈవీ కూడా ప్రతి యూనిట్ విద్యుత్తుకు ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుందనే (kWh/100 కిమీ) లెక్కలను ఇకపై పరిగణనలోకి తీసుకుంటారు.
ఈవీలు నిజంగా కాలుష్య రహితమేనా?
ఈవీల సైలెన్సర్ నుంచి పొగ రాకపోయినప్పటికీ, అవి నడవడానికి కావాల్సిన విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇక్కడ ప్రధానాంశం. భారతదేశంలో ఈ ఏడాది జనవరి వరకు జరిగిన విద్యుత్ ఉత్పత్తిలో మెజారిటీ భాగం అంటే 1056.43 బిలియన్ యూనిట్లు బొగ్గుతో నడిచే థర్మల్ ప్లాంట్ల నుంచే వచ్చింది. సౌర, పవన విద్యుత్ వాటా ఇంకా తక్కువగానే ఉంది. బొగ్గును మండించి విద్యుత్ తయారు చేసినప్పుడు భారీగా కార్బన్ విడుదల అవుతుంది. కాబట్టి ఈవీలు వాడే ప్రతి యూనిట్ విద్యుత్తు పరోక్షంగా పర్యావరణంపై ప్రభావం చూపుతోంది. అందుకే ఈవీలు విద్యుత్ వినియోగంలో మరింత పొదుపుగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
కంపెనీల ఎత్తుగడలకు ప్రభుత్వం చెక్
ప్రస్తుతం కంపెనీలు తమ పెట్రోల్, డీజిల్ కార్ల వల్ల వచ్చే కాలుష్యాన్ని కవర్ చేసుకోవడానికి సూపర్ క్రెడిట్స్ అనే విధానాన్ని వాడుతున్నాయి. అంటే కొన్ని ఈవీ మోడళ్లను లాంచ్ చేసి, వాటి ద్వారా వచ్చే క్రెడిట్లతో తమ భారీ కాలుష్య కారక పెట్రోల్ కార్ల పెనాల్టీల నుంచి తప్పించుకుంటున్నాయి. కొత్త నిబంధనల (CAFE-3) ప్రకారం, ఈ లోపాలను సరిదిద్దనున్నారు. కేవలం ఈవీలను అమ్మడమే కాదు, అవి ఎంత ఎనర్జీ ఎఫిషియంట్‌గా ఉన్నాయో లెక్క తేల్చనున్నారు. ఒక లీటర్ పెట్రోల్ శక్తిని (35 మెగాజూల్స్) విద్యుత్ యూనిట్లతో (1 kWh = 3.6 మెగాజూల్స్) పోల్చి చూస్తూ ప్రతి కారు సగటు ఇంధన సామర్థ్యాన్ని లెక్కిస్తారు.
పెట్రోల్ కార్లపై పెరగనున్న ఒత్తిడి
2030 నాటికి దేశంలో ఈవీల వాటా 15 శాతానికి చేరినా, మిగిలిన 85 శాతం కార్లు పెట్రోల్, డీజిల్ తోనే నడుస్తాయి. ఒకవేళ ఈవీలకు పూర్తిగా జీరో ఎమిషన్ హోదా ఇస్తే, కంపెనీలు తమ పెట్రోల్ ఇంజిన్ల టెక్నాలజీని మెరుగుపరచడం మానేస్తాయని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే, ఈవీలకు కూడా కఠినమైన విద్యుత్ వినియోగ నిబంధనలు పెట్టడం ద్వారా, అటు ఈవీలు ఇటు పెట్రోల్ కార్లు రెండూ పర్యావరణ హితంగా మారేలా ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో వాహనదారులు తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లే మేలైన ఈవీలను పొందే అవకాశం ఉంటుంది.

