EV Sales : భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన గిరాకీ.. బుకింగ్స్ కోసం ఎగబడుతున్న జనాలు
బుకింగ్స్ కోసం ఎగబడుతున్న జనాలు

EV Sales : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక్కసారిగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో విసిగిపోయిన వాహనదారులు.. ఇప్పుడు పెద్ద ఎత్తున ఈవీ కార్ల వైపు అడుగులు వేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే.. మార్కెట్లోని లీడింగ్ కంపెనీలైన మారుతి సుజుకి, మహింద్రా, టాటా మోటార్స్ తో పాటు లగ్జరీ బ్రాండ్లు అయిన మర్సడీజ్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి సంస్థలు కూడా కస్టమర్ల నుంచి వస్తున్న ఆర్డర్లను సకాలంలో సప్లై చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దేశంలో మోస్ట్ పాపులర్ ఈవీ మోడల్స్ పై ప్రస్తుతం ఒకటి నుంచి మూడు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. పెట్రోల్ భారం పెరగడమే ఈ సరికొత్త ఈవీ విప్లవానికి మెయిన్ టర్నింగ్ పాయింట్ అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
గతంలో కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే ఛార్జింగ్ నెట్‌వర్క్ సరిగ్గా ఉందో లేదోనని, కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించేవారు. కానీ ప్రస్తుత ఇంధన ధరల మంట ఆ భయాలన్నింటినీ పక్కకు నెట్టేసింది. ఈ ఏడాది మార్చి నెల తర్వాత బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఏకంగా 40 శాతం డిమాండ్ పెరిగిందని మర్సడీజ్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ వెల్లడించారు. ఏప్రిల్ నెలలో లాంచ్ అయిన ఆ కంపెనీ సరికొత్త సిఎల్ఏ బిఈవి ఎలక్ట్రిక్ సెడాన్ కారుకు ఊహించని రీతిలో బుకింగ్స్ వచ్చాయి. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కంపెనీ తాత్కాలికంగా ఈ కారు బుకింగ్స్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ మోడల్ కోసం కస్టమర్లు రెండు నుంచి మూడు నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకికి కూడా ఈవీ సెగ్మెంట్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. కంపెనీకి చెందిన సరికొత్త ఈ-విటారా ఎస్‌యూవీ కార్ బుకింగ్స్ కేవలం నెల రోజుల్లోనే డబుల్ అయ్యాయి. ఈ కారు డెలివరీ కావాలంటే ప్రస్తుతం 6 నుంచి 8 వారాల సమయం పడుతోంది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అంతర్జాతీయ ఘర్షణల వల్ల ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతోనే.. కస్టమర్లు ముందుగానే ఈవీల వైపు మళ్లుతున్నారని మారుతి సేల్స్ హెడ్ పార్థో బెనర్జీ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బీఎమ్‌డబ్ల్యూ కంపెనీ సైతం డిమాండ్‌ను తట్టుకోవడానికి.. ఈ ఏడాది ద్వితీయార్థం కోసం దాచి ఉంచిన స్టాక్‌ను ఇప్పుడే వాడేస్తోంది. అదనపు కార్ల సరఫరా కోసం తమ గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను కోరడానికి సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగానికి డిమాండ్ కంటే కూడా ప్రొడక్షన్, సప్లై చైన్ పెద్ద సవాలుగా మారింది. మహింద్రా కంపెనీకి చెందిన క్రేజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఎక్స్‌ఈవీ 9ఈ , బీఈ 6 మోడళ్లను సొంతం చేసుకోవడానికి కస్టమర్లు 4 నుంచి 8 వారాలు వేచి చూడాల్సి వస్తోంది. అలాగే మార్కెట్లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ కార్ల డెలివరీకి కూడా కనీసం 6 వారాల టైమ్ పడుతోంది. గతంలో షోరూమ్‌కు వెళ్లిన వెంటనే దొరికే జేఎస్‌డబ్ల్యూ ఎమ్‌జీ మోటార్స్ కి చెందిన విండ్సర్, జెడ్ఎస్ ఈవీ కార్లకు సైతం ఇప్పుడు ఒక నెల వెయిటింగ్ పీరియడ్ తప్పడం లేదు.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అందించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం కంపెనీకి వస్తున్న మొత్తం కార్ల బుకింగ్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఏకంగా 30 నుంచి 33 శాతానికి చేరుకుంది. కానీ, కంపెనీ నుంచి వాస్తవంగా జరుగుతున్న డెలివరీలు మాత్రం కేవలం 15 నుంచి 16 శాతంగానే ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే మార్కెట్లో ఈవీ కార్లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో స్పష్టంగా అర్థమవుతుంది. డిమాండ్‌కు సరిపడా బ్యాటరీలు, విడిభాగాలు అందించే సప్లయర్ నెట్‌వర్క్ ఇంకా పుంజుకోవాల్సి ఉందని, రాబోయే రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా ఈ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి కంపెనీలు కసరత్తులు చేస్తున్నాయి.

