EV CNG Vehicles: వాహనదారులకు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. ఈవీ, సీఎన్జీ బండ్ల జీవితకాలం 5 ఏళ్లు పెంపు
ఈవీ, సీఎన్జీ బండ్ల జీవితకాలం 5 ఏళ్లు పెంపు

EV CNG Vehicles: కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 1989 కేంద్ర మోటార్ వాహనాల నిబంధనలలో కీలక సవరణలు తెచ్చేందుకు ముసాయిదా విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనంతో నడిచేవి, సహజ వాయువు (సీఎన్జీ) తో పనిచేసే వాహనాల గరిష్ట వయోపరిమితిని అదనంగా మరో 5 ఏళ్లు పొడిగించాలని భావిస్తోంది. ఈ సవరణల వల్ల పర్యావరణహిత వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. ఆగస్టు 10న వెలువడిన ఈ డ్రాఫ్ట్ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా ప్రజాభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి తుది ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
డిజిటల్ రూపంలో నేషనల్ పర్మిట్లు
వాణిజ్య రంగంలో ఉండే సరుకు రవాణా వాహనదారులకు ఊరటనిస్తూ నేషనల్ పర్మిట్ల మంజూరు విధానాన్ని పూర్తిగా డిజిటల్ చేయనున్నారు. ఇకపై ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే ఒకేసారి గరిష్టంగా 5 ఏళ్ల కాలపరిమితికి నేషనల్ పర్మిట్ జారీ చేస్తారు. దరఖాస్తుదారులు తమ అవసరానికి తగినట్లుగా వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా నిర్ణీత రుసుము రూ.16,500 నేషనల్ పర్మిట్ ఖాతాలో చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ దరఖాస్తుల ద్వారా రవాణా రంగానికి వేగవంతమైన సేవలు అందుతాయి.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ నిబంధనల మార్పు
బాడీ నిర్మించని వాహన ఛాసిస్‌ల తాత్కాలిక రిజిస్ట్రేషన్ కాలపరిమితిని 6 నెలల వరకు వర్తింపజేయనున్నారు. బాడీ బిల్డింగ్ వర్క్‌షాప్‌లలో ఆలస్యమైతే అధికారులు ప్రతిసారీ 30 రోజుల చొప్పున సమయం పొడిగించే వెసులుబాటు కల్పించారు. పూర్తి స్థాయిలో తయారైన వాహనాలను ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే సందర్భాల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ చెల్లుబాటు వ్యవధిని 45 రోజులుగా ఖరారు చేశారు. ఆటో విడిభాగాల తయారీ సంస్థలకు ట్రేడ్ సర్టిఫికేట్ నిబంధనలు వర్తింపజేసేలా సవరణలు చేశారు.
వాహన్ పోర్టల్‌లో ఆటోమేటిక్ డేటా సేకరణ
నూతన మార్పుల ప్రకారం వాహన యజమానుల వివరాల నమోదు మరింత పారదర్శకంగా మారనుంది. డిజిటల్ దరఖాస్తుల్లో డీలర్ల జిఎస్టి, పాన్ నంబర్లు, కార్పొరేట్ గుర్తింపు సంఖ్యలను తప్పనిసరి చేశారు. వాహన యజమానులు దరఖాస్తుల్లో ఫోన్ నంబర్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. ఆర్సి, పియుసి, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లతో పాటు పెండింగ్ చలాన్లు, పాత పర్మిట్ల డేటా అంతా వాహన్ పోర్టల్‌లో ఆటోమేటిక్గా అప్‌డేట్ అయ్యేలా వ్యవస్థను రూపుదిద్దుతున్నారు.

