సగం ధరకే ఈవీలు.. ఇదిగో ప్రూఫ్

Electric Car : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. అయితే సామాన్యుడు ఎలక్ట్రిక్ కారు కొనాలంటే బ్యాటరీ ధర ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ భారంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆటోమొబైల్ కంపెనీలు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అనే సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ పద్ధతిలో మీరు కారు కొనేటప్పుడు బ్యాటరీకి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల కారు ధర ఒక్కసారిగా భారీగా తగ్గిపోతుంది. కేవలం కారు బాడీకి మాత్రమే డబ్బులు కట్టి, బ్యాటరీని నెలవారీ అద్దెకు లేదా మీరు తిరిగే కిలోమీటర్ల ఆధారంగా వాడుకోవచ్చు. టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఎంజీ మోటార్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ఈ మోడల్‌ను అనుసరిస్తున్నాయి.

టాటా పంచ్ ఈవీ విషయానికొస్తే.. దీని సాధారణ ధర సుమారు రూ.9.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కానీ మీరు BaaS మోడల్‌ను ఎంచుకుంటే, కేవలం రూ.6.49 లక్షలకే ఈ కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు. అంటే దాదాపు రూ.3 లక్షలకు పైగా ఆదా అవుతుంది. మీరు కార్లో ప్రయాణించే ప్రతి కిలోమీటరుకు నిర్ణీత రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఈ కారు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 355 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇక దేశీయ దిగ్గజం మారుతి సుజుకి కూడా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాలో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ కారు అసలు ధర రూ.15.99 లక్షలు కాగా, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో కేవలం రూ.10.99 లక్షలకే లభిస్తోంది. అంటే కొనేటప్పుడే రూ.5 లక్షల వరకు వెసులుబాటు దొరుకుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇచ్చే ఈ కారు, లాంగ్ జర్నీలు చేసే వారికి బెస్ట్ ఛాయిస్. మారుతి నమ్మకం, తక్కువ ధర కలవడంతో దీనికి బుకింగ్‌లు భారీగా వచ్చే అవకాశం ఉంది.

ఎంజీ మోటార్స్ కూడా ఈ రేసులో దూసుకుపోతోంది. ఎంజీ విండ్‌సర్ ఈవీ ఈ బాస్ మోడల్ వల్ల చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఇది ఒక ఛార్జ్‌పై 449 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే చిన్న కారు కోరుకునే వారి కోసం ఎంజీ కామెట్ కూడా ఉంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. 230 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం ఎంజీ జెడ్ఎస్ ఈవీ కూడా ఈ సర్వీస్ మోడల్‌లో అందుబాటులో ఉంది. ఇది 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

అసలు ఈ బాస్ మోడల్ ఎలా పనిచేస్తుందో సింపుల్ గా చెప్పాలంటే.. కారు, బ్యాటరీ యజమానులు వేర్వేరుగా ఉంటారు. కారుకు మీరు యజమాని అయితే, బ్యాటరీ మాత్రం కంపెనీదే అయి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో బ్యాటరీ పాడైపోయినా ఆ భారం మీ మీద పడదు, కంపెనీయే చూసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ లో డేటా ప్లాన్ లాగా, మీరు ఎంత వాడితే అంత చెల్లిస్తారు. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్ కారును అనుభవించాలనుకునే వారికి ఈ మోడల్ ఒక వరమని చెప్పాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story