Auto Sales: భారత ఆటోమొబైల్ రంగానికి అక్టోబర్ నెల కాస్త నిరాశనే మిగిల్చింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(FADA) విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్ నెలలో వాహనాల మొత్తం రిటైల్ అమ్మకాలు ఏకంగా 23.8 శాతం మేర పడిపోయి 31.72 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ పతనానికి కేవలం వాహనాల డిమాండ్ తగ్గడమే కారణం కాదు. పండుగల క్యాలెండర్‌లో వచ్చిన మార్పులు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గత ఏడాది అక్టోబర్‌లోనే నవరాత్రులు, దీపావళి రెండూ రాగా, ఈసారి నవరాత్రులు అక్టోబర్‌లో, ధంతేరస్ అలాగే దీపావళి పండుగలు నవంబర్ నెలకు మారడంతో కొనుగోళ్లు కాస్త వాయిదా పడ్డాయి.

ఈ అక్టోబర్ సేల్స్‌లో అత్యంత ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. వినియోగదారులు పెట్రోల్ వాహనాలకు బదులుగా సిఎన్‌జి, హైబ్రిడ్ అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. ఆల్టర్నేటివ్ ఫ్యూయెల్ కార్ల మార్కెట్ షేర్ ఏకంగా 41.83 శాతానికి చేరింది. పెట్రోల్ కార్ల వాటా 41.6 శాతానికి పరిమితమైంది. పెట్రోల్ ధరల భారం పెరగడం, పర్యావరణ స్పృహ పెరగడంతో కస్టమర్లు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మార్కెట్‌లో మొత్తంగా పతనం కనిపించినప్పటికీ ఎలక్ట్రిక్ వాహన రంగం మాత్రం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. అక్టోబర్‌లో ఏకంగా 3.55 లక్షల ఈవి యూనిట్లు అమ్ముడై కొత్త రికార్డును నెలకొల్పాయి. గతేడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 11.5 శాతం పెరిగాయి. ప్యాసింజర్ కార్ల విభాగంలో 4.23 శాతం స్వల్ప తగ్గుదల నమోదై 5.08 లక్షల యూనిట్లకు చేరుకోగా, ఎలక్ట్రిక్ విభాగానికి వచ్చిన ఆదరణ ఆటోమొబైల్ కంపెనీలకు తీవ్ర ఊరటనిచ్చింది.

టూ వీలర్స్ అమ్మకాలు అక్టోబర్ నెలలో ఏకంగా 28.35 శాతం పడిపోయి 23.21 లక్షల యూనిట్లకు పడిపోయాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు 33.97 శాతం మేర తగ్గిపోగా, పట్టణ ప్రాంతాల్లో 20.77 శాతం తగ్గుదల నమోదైంది. వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం 2.29 శాతం పెరిగి 1.15 లక్షల యూనిట్లకు చేరాయి. త్రీ-వీలర్స్ అమ్మకాలు 3.97 శాతం, ట్రాక్టర్ల అమ్మకాలు 3.10 శాతం చొప్పున స్వల్ప వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

నవంబర్ నెలలో ధంతేరస్, దీపావళి పండుగలు రావడంతో ఆటోమొబైల్ మార్కెట్ మళ్లీ పుంజుకుంటుందని FADA అధ్యక్షులు సాయి గిరిధర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 6న ధంతేరస్, నవంబర్ 8న దీపావళి పురస్కరించుకుని వాహనాల రిజిస్ట్రేషన్లు భారీగా జరిగే అవకాశం ఉంది. రాబోయే డిసెంబర్, జనవరి నెలల్లో వాహనాల అమ్మకాలు సంవత్సరాంతపు డిస్కౌంట్లు, కొత్త మోడళ్ల లాంచ్ ఆధారంగా సాగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story