Fact Check : 90 కి.మీ. మైలేజ్.. రూ. 59,000కే టాటా మోటార్స్ బైక్ లాంచ్?.. వైరల్ వార్తలో నిజమెంత?
రూ. 59,000కే టాటా మోటార్స్ బైక్ లాంచ్?.. వైరల్ వార్తలో నిజమెంత?

Fact Check : సోషల్ మీడియాలో ఇటీవల ఒక వార్త తీవ్రంగా వైరల్ అవుతోంది. ఆ వార్త ఏంటంటే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ కేవలం రూ.59,000 ధరతో, లీటరుకు 90కిమీ మైలేజ్ ఇచ్చే కొత్త 125సీసీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్ సహా అనేక ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త యువతను, బైక్ లవర్లను ఉత్సాహపరిచింది. అయితే, ఈ ప్రకటన వెనుక ఉన్న నిజం ఏమిటి? ఈ వార్తలో పెద్ద ట్విస్ట్ దాగి ఉంది. వాస్తవానికి, టాటా మోటార్స్ టూ వీలర్ సెగ్మెట్లోకి ప్రవేశిస్తుందా లేదా అనేదే అసలు ప్రశ్న.
గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో టాటా మోటార్స్ నుంచి ఒక కొత్త 125సీసీ బైక్ రాబోతోందనే వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. ఈ బైక్ ధర చాలా తక్కువగా రూ.59,000 ఉంటుందని, మైలేజ్ కూడా లీటరుకు 90కిమీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. అనేక మంది యువకులు, తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ వార్త పట్ల చాలా ఉత్సాహం చూపారు. సోషల్ మీడియా ప్రస్తుతం యువతకు ప్రధాన వార్తా మాధ్యమంగా మారడం వలన, నిజానిజాలు తెలుసుకోకుండానే ఇలాంటి వార్తలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి.
టాటా మోటార్స్ తరపున ఈ వార్త గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి, ఈ వార్త పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేలింది. టాటా మోటార్స్ ప్రస్తుతం ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి ప్రణాళికలు గానీ, తయారీ సదుపాయాలు గానీ కలిగి లేదు. భారతదేశంలోని టూ-వీలర్ మార్కెట్ ఇప్పటికే హీరో, బజాజ్, టీవీఎస్, హోండా వంటి దిగ్గజ సంస్థల ఆధిపత్యంలో ఉంది. టాటా వంటి ఒక కొత్త కంపెనీ, ఈ విభాగంలోకి ఒంటరిగా ప్రవేశించడం అంత సులభం కాదు.
ఒకవేళ టాటా నిజంగా టూ-వీలర్ విభాగంలోకి రావాలనుకుంటే, అది కచ్చితంగా ఏదైనా పెద్ద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి చర్చలు కూడా జరగడం లేదు. టాటా మోటార్స్ ప్రస్తుతం తమ దృష్టిని ప్రయాణీకుల వాహనాలు, వాణిజ్య వాహనాల విభాగాలపై మాత్రమే కేంద్రీకరించింది. ఈ నెలలో టాటా తమ ఐకానిక్ మోడల్ అయిన టాటా సియెర్రాను మళ్లీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రాబోయే కాలంలో కంపెనీ లగ్జరీ ఈవీ బ్రాండ్ అయిన అవినయ నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను కూడా మనం చూడవచ్చు.

