Fact Check : నీతా అంబానీకి రూ.100కోట్ల కారు ఉందా.. Audi A9 గురించి సంచలన నిజాలు
Audi A9 గురించి సంచలన నిజాలు

Fact Check : లగ్జరీ కార్లు అంటే చాలు భారతదేశంలో ముందుగా వినిపించే పేరు అంబానీ కుటుంబం. వారి కార్ కలెక్షన్‌లో రోల్స్ రాయిస్ వంటి ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే ఇటీవల కొన్ని వార్తా కథనాలు, నీతా అంబానీ భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు అయిన ఆడి A9ను కలిగి ఉన్నారని, దాని ధర ఏకంగా రూ.100 కోట్లు అని పేర్కొన్నాయి. కానీ ఈ ప్రచారం నిజం కాదు. నీతా అంబానీ ఖరీదైన రోల్స్ రాయిస్ కారును కలిగి ఉన్నారు. దాని ధర సుమారు రూ.10 కోట్లు మాత్రమే. మరి ఆడి A9 కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నీతా అంబానీ ఆడి A9 కారును కలిగి ఉన్నారనే వార్త పూర్తిగా తప్పుడుది. ఎందుకంటే ఆడి కంపెనీ ఇప్పటివరకు ఆడి A9 అనే మోడల్‌ను అసలు మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. ఇది పది సంవత్సరాల క్రితం జర్మన్ కంపెనీ ఆడి కేవలం ఒక కాన్సెప్ట్ కారుగా మాత్రమే ప్రదర్శించింది. ఈ కారును ఇప్పటివరకు ఉత్పత్తి చేయలేదు లేదా విక్రయించలేదు. అందుకే రూ.100 కోట్ల ఆడి A9 ను నీతా అంబానీ కొనుగోలు చేశారనే వార్త కేవలం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక అపోహ మాత్రమే.
ఆడి ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్ కారు నిజంగానే చాలా అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది. దీంట్లో 4.0 లీటర్ V8 ఇంజిన్ ఉండేది. అది దాదాపు 600 హెచ్‌పీ (హార్స్‌పవర్) ఎనర్జీని ఉత్పత్తి చేయగలదు. ఈ కారు పొడవు సుమారు 5 మీటర్లు ఉండేది. ఇందులో కేవలం రెండు డోర్లు మాత్రమే ఇచ్చారు. ఈ కారు అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏమిటంటే, కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా కారు రంగును మార్చుకునే సామర్థ్యం. దీని కోసం కారుకు ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ పెయింట్ స్కీమ్‌ను అమర్చారు.
ఈ ఆడి A9 కాన్సెప్ట్ కారును స్పానిష్ డిజైనర్ డేనియల్ గార్సి డిజైన్ చేశారు. దీనిని అద్భుతమైన టూ-డోర్ కూపేగా రూపొందించారు. ఈ కాన్సెప్ట్ కారులో విండ్‌షీల్డ్ మరియు రూఫ్‌ను ఒకే విధంగా ఇంటిగ్రేట్ చేశారు. దీనిలో అప్పట్లో ఇతర కార్లలో లేని అనేక ఆధునిక మరియు భవిష్యత్తు టెక్నాలజీ ఫీచర్లను జోడించారు. ఈ డిజైన్, సాంకేతికత అప్పట్లో కారు ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
