అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన కంపెనీల లిస్ట్ ఇదే

EV Sales : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. అక్టోబర్ నెలలో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ విక్రయాలు ఏకంగా 57 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 11,464 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి ఆ సంఖ్య 18,055 యూనిట్లకు చేరింది. దేశంలో ఈవీల డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో ఈ వృద్ధి రేటు స్పష్టం చేస్తోంది.

ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ప్రస్తుతం పోటీ చాలా తీవ్రంగా మారింది. ఈ సెగ్మెంట్‌కు ఇప్పటికీ టాటా మోటార్స్ లీడర్‌గా ఉంది. అక్టోబర్‌లో టాటా 7,239 యూనిట్ల రిజిస్ట్రేషన్లు సాధించింది. అయితే గత ఏడాదితో పోలిస్తే టాటా కేవలం 10 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేయగలిగింది. టాటాకు గట్టి పోటీని ఇస్తూ ఎంజీ మోటార్ ఇండియా ఈసారి అద్భుతమైన ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచింది. ఎంజీ 4,549 యూనిట్లు అమ్మి 63% వృద్ధి సాధించింది.

అత్యధిక వృద్ధిని చూపించింది మాత్రం మహీంద్రా అండ్ మహీంద్రా. గత ఏడాది కేవలం 955 యూనిట్లు మాత్రమే అమ్మి, ఈ అక్టోబర్‌లో ఏకంగా 3,911 యూనిట్లు రిజిస్టర్ చేసి భారీ వృద్ధిని నమోదు చేసింది. కియా 656 యూనిట్లు, బివైడీ 570 యూనిట్లు అమ్మి ఈ విభాగంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నాయి.

ప్యాసింజర్ వాహనాలతో పోలిస్తే, ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో వృద్ధి మాత్రం చాలా నెమ్మదిగా ఉంది. ఈ విభాగంలో కేవలం 3 శాతం స్వల్ప వృద్ధి మాత్రమే కనిపించింది. మొత్తం అమ్మకాలు 1,43,887 యూనిట్లకు పెరిగాయి. ఈ సెగ్మెంట్‌లో బజాజ్ ఆటో (31,426 యూనిట్లు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టీవీఎస్ 29,515 యూనిట్లతో, ఏథర్ ఎనర్జీ 28,101 యూనిట్లతో దాని వెనకాలే ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ కూడా 16,036 యూనిట్లతో టాప్ లిస్ట్‌లో నిలిచింది.

కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల విభాగం ఈ నెలలో అన్నింటి కంటే బలమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు 100 శాతానికి పైగా పెరిగి, 1,767 యూనిట్లకు చేరుకున్నాయి. లాజిస్టిక్స్, డెలివరీ, ఫ్లీట్ ఆపరేషన్లలో ఈవీలను స్వీకరించే వేగం పెరగడం ఈ భారీ వృద్ధికి సంకేతం. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ విభాగం కూడా 5% వృద్ధిని నమోదు చేసి 70,604 యూనిట్లు అమ్మింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story