Fastag: ఫాస్టాగ్ డబ్బులు కట్ అయ్యాయా? క్షణాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!
వెనక్కి తెచ్చుకోండిలా!

Fastag: ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద సమయం ఆదా చేయడానికి ఫాస్టాగ్ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే కొన్నిసార్లు వాహనం ఎక్కడికీ కదలకుండా ఇంట్లోనే పార్క్ చేసి ఉన్నప్పటికీ టోల్ డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు వస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఒకే టోల్ గేట్ వద్ద రెండుసార్లు నగదు మినహాయింపు జరుగుతుంటుంది. ఇలాంటి సాంకేతిక లోపాలు లేదా పొరపాటున అదనపు డబ్బులు కట్ అయినప్పుడు వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా కోల్పోయిన డబ్బును తిరిగి పొందవచ్చు.
పొరపాటున డబ్బులు కట్ కావడానికి కారణాలు
ఫాస్టాగ్ పూర్తిగా డిజిటల్ విధానంలో పనిచేయడం వల్ల కొన్నిసార్లు టోల్ ప్లాజా స్కానర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయి. దీనివల్ల ఒకే పేమెంట్ రిక్వెస్ట్ రెండుసార్లు వెళ్లడం లేదా వాహన నెంబర్ సరిగ్గా రీడ్ కాకపోవడం జరుగుతుంది. అలాగే స్కానర్ పనిచేయని సమయంలో మీరు నేరుగా నగదు చెల్లించినప్పటికీ, తర్వాత ఫాస్టాగ్ ఖాతా నుంచి మళ్లీ డబ్బులు కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రిటర్న్ జర్నీలో రావాల్సిన డిస్కౌంట్ వర్తించకపోయినా అదనపు మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి టోల్ సమయంలో వచ్చే ఎస్ఎంఎస్లు, ట్రాన్సాక్షన్ ఐడీలను భద్రంగా దాచుకోవడం చాలా ముఖ్యం.
బ్యాంకును ఆశ్రయించడం ఎలా?
మీ ఫాస్టాగ్ నుంచి అనధికారికంగా డబ్బులు కట్ అయితే వెంటనే ఆ ట్యాగ్‌ను జారీ చేసిన బ్యాంకును సంప్రదించాలి. చాలా వరకు బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా కస్టమర్ కేర్ ద్వారా కంప్లైంట్ చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఫిర్యాదు చేసే సమయంలో కారు రిజిస్ట్రేషన్ నెంబర్, లావాదేవీ జరిగిన తేదీ, సమయం, కట్ అయిన మొత్తం వివరాలు కచ్చితంగా అందించాలి. బ్యాంక్ అధికారులు దీనిని పరిశీలించి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ద్వారా సంబంధిత టోల్ ప్లాజా బ్యాంకుతో మాట్లాడి డబ్బులు రిఫండ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు.
1033 హెల్ప్‌లైన్, ఐహెచ్ఎంసీఎల్ సాయం
బ్యాంకు నుంచి సరైన స్పందన లభించకపోతే జాతీయ రహదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన 1033 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. స్కానర్లు పనిచేయకపోవడం లేదా టోల్ సిబ్బంది ఫాస్టాగ్ తీసుకోకపోవడం వంటి సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. అలాగే నేరుగా ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ నోడల్ అధికారికి ఈమెయిల్ పంపడం ద్వారా కూడా న్యాయం పొందవచ్చు.
డబ్బులు ఖాతాలో పడటానికి పట్టే సమయం
ఫిర్యాదు చేసిన తర్వాత తప్పుగా కట్ అయిన డబ్బులు తిరిగి మీ అకౌంట్లో జమ కావడానికి కొంత సమయం పడుతుంది. విచారణ పూర్తి కావడానికి సాధారణంగా 20 నుంచి 30 రోజుల పనిదినాలు పడుతుంది. సాధారణంగా 40 రోజుల్లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది కానీ హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకుల నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. ఒకవేళ బ్యాంకులు నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించకపోతే నేరుగా ఆర్బీఐ ఓంబ్డెస్మన్ పోర్టల్‌లో కంప్లైంట్ నమోదు చేసే అవకాశం ఉంది.

