FASTag : జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించే వాహనదారులందరికీ ఫాస్టాగ్ ఎంత అత్యవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కారు విండ్‌స్క్రీన్‌కు ఉన్న ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజా వద్ద ఉండే స్కానర్ రీడ్ చేయగానే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయిపోతాయి. అయితే, కొన్నిసార్లు టోల్ ప్లాజా వద్దకు వెళ్ళినప్పుడు అక్కడి స్కానర్ సరిగ్గా పని చేయక లేదా సర్వర్ డౌన్ అవ్వడం వల్ల మీ ఫాస్టాగ్ స్కాన్ అవ్వదు. ఇలాంటి సమయంలో టోల్ సిబ్బంది మిమ్మల్ని క్యాష్ ఇవ్వాలని వేధిస్తుంటారు. కానీ, టోల్ ప్లాజా సిస్టమ్ లో తప్పు ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఉచితంగా టోల్ దాటవచ్చని ప్రభుత్వ నియమాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తప్పు టోల్ ప్లాజాది అయితే.. మీ ప్రయాణం ఫ్రీ!

ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL),నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిబంధనల ప్రకారం.. మీ వాహనానికి ఉన్న ఫాస్టాగ్ ట్యాగ్ పక్కాగా వర్కింగ్ కండిషన్‌లో ఉండి, అందులో తగినంత బ్యాలెన్స్ కూడా ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజా వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ లోపం కారణంగా అది స్కాన్ అవ్వకపోతే, వాహనదారుడికి అక్కడ ఉచితంగా ప్రయాణించే హక్కు ఉంటుంది. టోల్ ప్లాజా యాజమాన్యం వారి సాంకేతిక లోపాలకు కస్టమర్లను బాధ్యులను చేస్తూ అదనపు డబ్బులు వసూలు చేయకూడదు.

క్యాష్ కట్టమని బలవంతం చేస్తే ఒప్పుకోవద్దు

సర్వర్ డౌన్, ఇంటర్నెట్ సమస్య లేదా స్కానర్ విరిగిపోవడం వంటివి టోల్ ప్లాజా నిర్వహణ లోపాల కిందకు వస్తాయి. ఇటువంటి సందర్భాల్లో ప్రయాణికులను గంటల తరబడి లైన్లలో నిలబెట్టడం లేదా డబుల్ క్యాష్ కట్టమని బలవంతం చేయడం చట్టవిరుద్ధం. అయితే ఇక్కడ వాహనదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కేవలం టోల్ ప్లాజా సిస్టమ్ చెడిపోయినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. మీ ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోయినా, మీ ట్యాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నా లేదా ట్యాగ్ దెబ్బతిన్నా ఈ రూల్ వర్తించదు. అప్పుడు మీరు ఖచ్చితంగా సాధారణ పద్ధతిలో టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

1033 నంబర్‌కు ఫిర్యాదు చేయండి

మీ ఫాస్టాగ్ అకౌంట్ లో డబ్బులు ఉండి, స్కానర్ పనిచేయకపోయినా టోల్ సిబ్బంది మిమ్మల్ని ఆపి డబ్బులు అడిగితే.. మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే ప్రభుత్వ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 1033 కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ప్లాజా వద్ద ఉండే మేనేజర్‌ను కలిసి నిబంధనల గురించి నిలదీయవచ్చు. ప్రయాణానికి ముందే మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, అలాగే ట్యాగ్‌ను కారు విండ్‌స్క్రీన్ మధ్యలో సరిగ్గా అతికించడం ద్వారా స్కానింగ్ సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. మీ వైపు తప్పు లేనప్పుడు ప్రభుత్వ రూల్స్ మీకు అండగా నిలుస్తాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story