Flex-Fuel Car : అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 15 వేలకే మీ పాత కారు ఫ్లెక్స్ ఫ్యూయల్‌గా మార్చుకోవచ్చు
మీ పాత కారు ఫ్లెక్స్ ఫ్యూయల్‌గా మార్చుకోవచ్చు

Flex-Fuel Car : భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తోంది. అయితే దీనికోసం కస్టమర్లు కొత్త కార్లు కొనాల్సిన అవసరం లేకుండా, పాత పెట్రోల్ కార్లనే ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌గా మార్చడానికి ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) ఒక అద్భుతమైన ప్రతిపాదనను తీసుకువచ్చింది. కేవలం ఒక చిన్న కన్వర్షన్ కిట్ ద్వారా మీ పాత పెట్రోల్ కారును ఇథనాల్‌తో నడిచేలా మార్చుకోవచ్చు.
కేవలం రూ. 15 వేల బడ్జెట్‌లోనే కిట్
ISMA నివేదిక ప్రకారం.. ఈ సరికొత్త ఇథనాల్ కన్వర్షన్ కిట్ టెక్నాలజీకి గనుక ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు లభించి, స్థానికంగా (మేక్ ఇన్ ఇండియా కింద) ఉత్పత్తి ప్రారంభమైతే, దీని ధరను కస్టమర్ల కోసం కేవలం రూ.15,000గా నిర్ణయించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ కిట్ అందుబాటులోకి వస్తే, దేశంలోని లక్షలాది మంది మిడిల్ క్లాస్ పెట్రోల్ కార్ల యజమానులకు, ముఖ్యంగా టాక్సీ ఆపరేటర్లకు, రోజువారీ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే వారికి ఇది ఒక లాభదాయకమైన వరంగా మారుతుంది.
మారుతి సుజుకి కారుపై ఐఐటీ ఢిల్లీ ప్రయోగం
ఈ సాంకేతికత ఎంతవరకు సురక్షితం, నమ్మదగినదో తెలుసుకోవడానికి ISMA సంస్థ విదేశాల నుంచి ప్రత్యేక ఇథనాల్ కన్వర్షన్ కిట్లను తెప్పించింది. వీటిని పరీక్షించడానికి ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ సంస్థతో చేతులు కలిపింది. ఈ పరిశోధనల కోసం బీఎస్4 ప్రమాణాలు కలిగిన ఒక మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారును ఎంచుకున్నారు. ఆ కారుకు ఈ కిట్‌ను అమర్చి E20, E85, పూర్తి ఇథనాల్ అయిన E100 ఇంధనాలతో దాదాపు 5,000 నుంచి 10,000 కిలోమీటర్ల దూరం రోడ్లపై నడిపారు. ఈ సుదీర్ఘ టెస్టింగ్‌లో కారు ఇంజిన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
ఈ కన్వర్షన్ కిట్ ఎలా పనిచేస్తుంది?
ఒక సాధారణ పెట్రోల్ కారును ఫ్లెక్స్ ఫ్యూయల్ కారుగా మార్చడానికి ఈ కిట్‌లో ఇథనాల్ సెన్సార్, అప్‌గ్రేడెడ్ ఇంజిన్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సెట్టింగ్స్, కోల్డ్ స్టార్ట్ సిస్టమ్, ఇథనాల్ ఇంధనానికి తట్టుకునే ప్రత్యేక పైపులు, విడిభాగాలు ఉంటాయి. అయితే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ (శక్తి సామర్థ్యం) పెట్రోల్ కంటే కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంజిన్ సమానమైన పవర్‌ను జనరేట్ చేయడానికి కొంచెం ఎక్కువ ఇంధనాన్ని తీసుకుంటుంది. అయినప్పటికీ, కిట్ ధర రూ. 15,000 కావడం వల్ల కొత్త కారు కొనే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా చౌకైన మార్గం. అయితే ఇన్‌స్టాలేషన్, గుర్తింపు సర్టిఫికేషన్, ఇతర ఛార్జీల వల్ల దీని వాస్తవ ఖర్చు కొద్దిగా పెరగొచ్చు.
దేశంలో E85 ఇంధనం అమ్మకాలు షురూ
భారతదేశంలో 2026 జూన్ నెల నుంచి ప్రముఖ నగరాల్లో E85 (85 శాతం ఇథనాల్, 15శాతం పెట్రోల్) ఇంధనం అమ్మకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి దశలో దేశవ్యాప్తంగా దాదాపు 48 పెట్రోల్ బంకుల్లో ఈ సదుపాయాన్ని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత విస్తరిస్తూ 2026 డిసెంబర్ నాటికి 500 బంకులకు, అలాగే 2027 చివరి నాటికి ఏకంగా 5,000 పెట్రోల్ బంకులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే సాధారణ పెట్రోల్ ధరతో పోలిస్తే E85 ధర లీటరుకు రూ. 20 వరకు తక్కువగా ఉంది. కాబట్టి ఈ కన్వర్షన్ కిట్లకు పూర్తి స్థాయి వాణిజ్య అనుమతులు వస్తే ఆటోమొబైల్ రంగంలో సరికొత్త మైలేజ్ విప్లవం రావడం ఖాయం.

