Flying Cars: మహా నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నప్పుడు మన కారుకు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగిరితే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. ఆ ఊహ త్వరలోనే నిజం కాబోతోంది. చైనా, అమెరికా, జపాన్, బ్రిటన్ దేశాలతో పాటు మన భారతదేశంలో కూడా ఎగిరే కార్ల (eVTOL) తయారీపై ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. రన్‌వే అవసరం లేకుండా హెలికాప్టర్ లాగా నిట్టనిలువునా పైకి లేచి, విమానం లాగా ముందుకు దూసుకెళ్లే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు 2028 నాటికి సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎయిర్ ట్యాక్సీల రేసులో చైనా కంపెనీల హవా

ప్రపంచవ్యాప్తంగా ఎగిరే వాహనాల తయారీలో చైనా అందరికంటే ముందుంది. చైనాకు చెందిన ఈహ్యాంగ్ సంస్థ రూపొందించిన EH216-S ఎయిర్ ట్యాక్సీకి ఎలాంటి పైలట్ అవసరం లేకుండానే ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. దీనికి డిజైన్, తయారీ, ప్రయాణికుల సేవల కోసం అవసరమైన మూడు ప్రధాన అనుమతులు ఇప్పటికే లభించాయి. మరో చైనా సంస్థ ఆటోఫ్లైట్ ఐదుగురు ప్రయాణించే విమానాలను పరీక్షిస్తుండగా, ఎక్స్‌పెంగ్ కంపెనీ 2027లో రెండు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

అమెరికా, జపాన్, బ్రిటన్ దేశాల్లో వేగంగా అడుగులు

అమెరికాలో జోబీ ఏవియేషన్, ఆర్చర్ ఏవియేషన్ సంస్థలు ప్రభుత్వ అనుమతుల కోసం తుది దశలో ఉన్నాయి. 2028 ఒలింపిక్స్ నాటికి లాస్ ఏంజిల్స్ నగరంలో ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని ఆర్చర్ లక్ష్యంగా పెట్టుకుంది. అటు టెస్లా సంస్థ కూడా గాల్లోకి ఎగిరి సురక్షితంగా ల్యాండ్ అయ్యే సరికొత్త రోడ్‌స్టర్ కారును ప్రదర్శించింది. జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ ఇప్పటికే 300కు పైగా టెస్ట్ ఫ్లైట్లను పూర్తి చేయగా, బ్రిటన్‌లో వెర్టికల్ ఏరోస్పేస్ సంస్థ 2028 నాటికి వాణిజ్య సేవలు అందించాలని ప్రణాళికలు రచిస్తోంది.

భారత్‌లోనూ దూసుకెళ్తున్న దేశీయ స్టార్టప్‌లు

ఎగిరే కార్ల సాంకేతికతలో భారతదేశం కూడా ఏమాత్రం వెనుకబడి లేదు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సర్ల ఏవియేషన్ 700 కిలోల బరువున్న నమూనాపై 500కు పైగా పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. ఆరుగురు ప్రయాణించే శూన్య ఎయిర్ ట్యాక్సీ తయారీ కోసం డీజీసీఏ (DGCA) నుంచి డిజైన్ అనుమతిని కూడా పొందింది. మరోవైపు చెన్నైకి చెందిన ది ఈప్లేన్ కంపెనీ e200X ప్రోటోటైప్‌ను సిద్ధం చేసింది. ముందుగా ఎయిర్ అంబులెన్స్ సేవలను, ఆ తర్వాత ప్రయాణికుల రవాణాను ప్రారంభించేందుకు ఏప్రిల్ 2027 నుంచి పరీక్షలు నిర్వహించనుంది.

సామాన్యులకు అందుబాటులోకి రావడానికి ఉన్న సవాళ్లు

ఈ ఎగిరే వాహనాలు పూర్తిస్థాయిలో రోడ్లపైకి రావాలంటే ఇంకా కొన్ని సాంకేతిక సవాళ్లను అధిగమించాల్సి ఉంది. బ్యాటరీ బరువు తగ్గించడం, ఒక్కసారి ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించేలా చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యే సిస్టమ్స్ మెరుగుపరచడం చాలా ముఖ్యం. వీటితో పాటు నగరాల్లో ప్రత్యేక ఎయిర్ రూట్లు, తక్కువ శబ్దం, విమానాశ్రయాల్లో ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు సిద్ధమైతే ఆకాశయానం సామాన్యులకు మరింత చేరువవుతుంది.

Next Story