Hero : కిలోమీటరుకు రూ.1.24లే ఖర్చు.. హీరో నుంచి అతి తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్
హీరో నుంచి అతి తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్

Hero : భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో హీరో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వి1 వీఎక్స్2 ధరలను భారీగా తగ్గించింది. కంపెనీ కొత్తగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా స్కూటర్ ప్రారంభ ధరలో రూ.15,000 తగ్గింపు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ స్కూటర్ కేవలం రూ.44,490 (ఎక్స్-షోరూమ్) ధరకే లభిస్తోంది. దీని మునుపటి ధర రూ.59,490 గా ఉండేది.
ఈ కొత్త స్కీమ్ ప్రకారం కస్టమర్లు స్కూటర్ బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. అంటే, బ్యాటరీని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా ఎంత దూరం ప్రయాణిస్తే అంత అద్దె చెల్లిస్తారు. రైడర్ ప్రతి కిలోమీటరుకు ఒక నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మోడల్ వల్ల ప్రారంభ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్‌ల ధరలు, వివరాలు తెలుసుకుందాం.
విడా వీఎక్స్2 గో వేరియంట్ ప్లాన్‌లు
విడా వీఎక్స్2 గో బేస్ వేరియంట్‌ను రెండు ప్లాన్‌లలో సెలక్ట్ చేసుకోవచ్చు. అవి 3 సంవత్సరాల ప్లాన్, 5 సంవత్సరాల ప్లాన్.
3 సంవత్సరాల ప్లాన్: ఈ ప్లాన్‌లో ప్రతి కిలోమీటరుకు రూ.1.24 ఖర్చవుతుంది. దీనికి కనీస నెలవారీ దూరం 1,200 కి.మీ. (రోజుకు సుమారు 40 కి.మీ.). ప్రతి నెలా రూ.1,488 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నిర్ణీత దూరం ప్రయాణించకపోయినా ఈ మొత్తం చెల్లించాలి.
5 సంవత్సరాల ప్లాన్: ఈ ప్లాన్‌లో ప్రతి కిలోమీటరుకు రూ.1.47 ఖర్చవుతుంది. ఇందులో కనీస నెలవారీ దూరం 750 కి.మీ. (రోజుకు 25 కి.మీ.)గా ఉంటుంది. ప్రతి నెలా రూ.1,103 చెల్లించాల్సి ఉంటుంది.
విడా వీఎక్స్2 ప్లస్ వేరియంట్ ప్లాన్‌లు
టాప్ మోడల్ అయిన వీఎక్స్2 ప్లస్ కోసం మూడు ప్లాన్‌లు ఉన్నాయి. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల ప్లాన్‌లు.
2 సంవత్సరాల ప్లాన్: ఈ ప్లాన్‌లో నెలకు రూ.2,160 చెల్లించాల్సి ఉంటుంది. దీని కనీస నెలవారీ దూరం 2,400 కి.మీ. ప్రతి కిలోమీటరుకు ఖర్చు కేవలం రూ.0.90, ఇది అన్ని ప్లాన్‌లలోనూ అతి తక్కువ ఖర్చు.
3 సంవత్సరాల ప్లాన్: ఈ ప్లాన్‌లో నెలకు రూ.1,584 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి నెలవారీ దూరం 1,600 కి.మీ. ప్రతి కిలోమీటరుకు ఖర్చు రూ.0.99.
5 సంవత్సరాల ప్లాన్: ఈ ప్లాన్‌లో మీరు నెలకు రూ.1,128 చెల్లించాలి. దీనికి నెలవారీ దూరం 800 కి.మీ. ప్రతి కిలోమీటరుకు ఖర్చు రూ.1.41.
ఈ ప్లాన్‌లను ఎంచుకున్న కస్టమర్లు ఒకసారి రూ.1,199 స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంటేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ BaaS మోడల్ ద్వారా స్కూటర్ ధర చాలా తక్కువగా ఉండడంతో, ఎక్కువ మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది.
