భారీగా డబ్బులు ఆదా

Electric Scooter : ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ కోసం సబ్సిడీని రూ.20,000 నుండి రూ.30,000కి పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తీసుకున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ నిబంధనను తన కొత్త ఈవీ పాలసీ 2025 డ్రాఫ్ట్‌లో చేర్చింది. దీనిపై ఇండస్ట్రీ నుండి సూచనలు, సలహాలు అందిన తర్వాత ఐదేళ్లపాటు అమలు చేయబడుతుంది. కొత్త డ్రాఫ్ట్ ఈవీ పాలసీ 2025 ప్రకారం.. ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌పై బ్యాటరీ కెపాసిటీ ప్రకారం ప్రతి కిలోవాట్-అవర్‌కు రూ.5,000 చొప్పున ప్రోత్సాహకం ఇస్తుంది. ఈ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.30,000 ఉంటుంది. ఇంతకు ముందు ఈ గరిష్ట సబ్సిడీ రూ.20,000 మాత్రమే ఉండేది. ఈ పెంపుతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని ఒడిశా ప్రభుత్వం ఆశిస్తోంది.

ఒక ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కెట్‌లో ఇప్పుడు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు, ద్విచక్ర వాహనాలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని వాటికి అనుగుణంగా పెంచాలని నిర్ణయించింది. ద్విచక్ర వాహనాలతో పాటు, ఒడిశా ప్రభుత్వం బ్యాటరీతో నడిచే త్రీ వీలర్లు, ఫోర్ వీలర్లు, ట్యాక్సీలు, ట్రక్కులు, బస్సులకు కూడా సబ్సిడీ ఇస్తుంది. 2030 వరకు అమలులో ఉండే కొత్త ఈవీ పాలసీ 2025 కింద, ఫోర్ వీలర్లు తేలికపాటి మోటారు వాహనాలకు లేదా టాక్సీలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.1.50 లక్షల నుండి రూ.2 లక్షలకు పెంచుతారు. అలాగే, ఎలక్ట్రిక్ బస్సుల రిజిస్ట్రేషన్‌కు రూ.20 లక్షల ప్రోత్సాహకం కూడా ఇస్తామని ఆ అధికారి తెలిపారు.

ఈ పాలసీ పత్రం ప్రకారం ఈ ప్రయోజనాలు ఒడిశాలో శాశ్వత నివాసం ఉన్న వారికి మాత్రమే లభిస్తాయి. ప్రతి లబ్ధిదారుడు ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహకాన్ని పొందగలడు. ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి రూ.15 కోట్ల ప్రత్యేక నిధిని కూడా డ్రాఫ్ట్ ఈవీ పాలసీలో ప్రతిపాదించారు. సెప్టెంబర్ 2021లో అమలులోకి వచ్చిన ఒడిశా ఎలక్ట్రిక్ పాలసీ 2021 ప్రకారం, తదుపరి నాలుగు సంవత్సరాలలో కొత్త రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటా 20% ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ లక్ష్యం నెరవేరలేదు. ఈ కాలంలో ఈ శాతం కేవలం 9% మాత్రమే ఉంది. అందుకే ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం కింద, 2030 నాటికి కొత్త రిజిస్ట్రేషన్లలో ఈవీల వాటాను 50%కి పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story