Road Safety: దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అలాగే ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఉత్పత్తి అయ్యే ప్రతి నూతన కారులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్‌(AEBS)ను నిర్బంధం చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS) విభాగంలో భాగమైన ఈ టెక్నాలజీని 2030 అక్టోబర్ నాటికి కొత్త ఎం1 కేటగిరీ ప్రయాణీకుల కార్లలో తప్పనిసరి చేయాలని, అక్టోబర్ 2032 నాటికి మార్కెట్లో ఉన్న అన్ని ఎం1 కార్లలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడానికి 30 రోజుల గడువు ఇస్తూ ముసాయిదా విడుదల చేసింది.

ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటే ఏమిటి?

ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది డ్రైవర్ అప్రమత్తంగా లేని సమయంలో వాహనం ముందు ఉన్న ప్రతిబంధకాలను లేదా ఇతర వాహనాలను గుర్తించి స్వయంచాలకంగా బ్రేకులు వేసే టెక్నాలజీ. ఉదాహరణకు ప్రయాణంలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఏవైనా అడ్డంకులు వస్తే, డ్రైవర్ స్పందించేలోపే కారులోని సెన్సార్లు ప్రమాదాన్ని ముందే ఊహించి బ్రేకింగ్ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల ప్రమాద తీవ్రత తగ్గడమే కాకుండా ప్రాణనష్టం జరగకుండా నివారించవచ్చు. అయితే ఇది డ్రైవర్‌కు సహాయకారిగా మాత్రమే పనిచేస్తుందని, రోడ్డుపై వాహనదారుల శ్రద్ధ నిరంతరం అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

దశలవారీగా రూల్స్ అమలు చేసే టైమ్‌లైన్

ఈ నూతన నిబంధనలను ఒకేసారి కాకుండా దశలవారీగా ప్రవేశపెట్టేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. అక్టోబర్ 1, 2028 నుంచి ఏఈబీఎస్ ఉన్న వాహనాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1, 2030 నుంచి నూతనంగా తయారయ్యే అన్ని కార్లకు ఈ ఫీచర్ నిర్బంధం కానుంది. అనంతరం అక్టోబర్ 1, 2032 నాటికి మార్కెట్లో కొనసాగుతున్న పాత కార్ల మోడళ్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. కేవలం బ్రేకింగ్ మాత్రమే కాకుండా కార్ల స్టీరింగ్ నియంత్రణ, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్‌లపై కూడా నూతన మార్గదర్శకాలను తేనున్నారు.

వాణిజ్య వాహనాలలోనూ భద్రతా ప్రమాణాలు

భారీ వాహనాలైన ట్రక్కులు, బస్సుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు జనవరి 2027 నుంచి నూతన మోడళ్లలో ఏఈబీఎస్ అమర్చాలని ప్రతిపాదించారు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, డ్రైవర్ నిద్రమత్తును గుర్తించే అలర్ట్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను కూడా వీటికి జోడించనున్నారు. అలాగే అక్టోబర్ 1, 2027 నుంచి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ను లారీల్లో తప్పనిసరి చేయనున్నారు. ఇవన్నీ వాహనం మలుపులు తిరిగేటప్పుడు బోల్తా పడకుండా రక్షణ ఇస్తాయి.

వాహనాల మధ్య డేటా ఎక్సేంజ్ టెక్నాలజీ

అక్టోబర్ 1, 2028 నుంచి ఉత్పత్తి అయ్యే వాహనాలలో వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సాంకేతికత ద్వారా రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఒకదానికొకటి తమ వేగం, దిశ, ప్రయాణిస్తున్న ప్రదేశం గురించిన సమాచారాన్ని రేడియో సిగ్నల్స్ ద్వారా పంచుకుంటాయి. దీనివల్ల మలుపుల వద్ద లేదా ఎదురెదురుగా వచ్చే వాహనాల ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు. ఈ కొత్త టెక్నాలజీలు భారతీయ రోడ్డు రవాణా వ్యవస్థలో సంచలనాత్మక మార్పులు తేనున్నాయి.

Next Story