Ethanol Blending : ఇక ఇంధనంలో 30% ఇథనాల్.. పెట్రోల్ రేట్లకు బ్రేక్ వేసేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్
పెట్రోల్ రేట్లకు బ్రేక్ వేసేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

Ethanol Blending : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతుండటంతో భారత్ ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఏకంగా 30 శాతం వరకు ఇథనాల్‌ను కలిపేందుకు సరికొత్త టెక్నికల్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ20 (20% ఇథనాల్) విధానాన్ని దాటి.. భవిష్యత్తు కోసం E22, E25, E27, E30 ఇంధన మిశ్రమాల తయారీకి సాంకేతిక ఏర్పాట్లను ప్రారంభించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఈ కొత్త ఇంధన బ్లెండింగ్ ప్రమాణాలను అధికారికంగా విడుదల చేసింది, ఇవి మే 15, 2026 నుంచే అమలులోకి వచ్చాయి.
గ్లోబల్ టెన్షన్స్ ఎఫెక్ట్..
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా కీలకమైన అంతర్జాతీయ సముద్ర మార్గం హోర్ముజ్ జలసంధి మూతపడటం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ఈ ఇంధన సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక ప్రణాళికను తెరపైకి తెచ్చింది. కొత్త బిఐఎస్ నిబంధనల ప్రకారం.. ఎక్కువ ఇథనాల్‌తో నడిచే వాహనాలు, ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ల భద్రత, నాణ్యత, ఆక్టేన్ స్థాయిలు, సల్ఫర్ పరిమితి, తుప్పు పట్టకుండా ఉండేలా ప్రత్యేక సాంకేతిక పారామితులను నిర్దేశించారు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే కొత్త కార్లు, బైకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లీన్ ఎనర్జీతో నడుస్తాయి.
హర్షం వ్యక్తం చేస్తున్న ఇథనాల్ ఇండస్ట్రీ
ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని దేశీయ ఇథనాల్ పరిశ్రమల సంఘాలు స్వాగతించాయి. దీనివల్ల దేశంలో పర్యావరణహితమైన (గ్రీన్) రవాణా పెరగడమే కాకుండా రైతులకు, పరిశ్రమలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 2 బిలియన్ లీటర్లకు చేరుకుంది, అయితే ఆయిల్ కంపెనీల కొనుగోళ్లు ఇప్పటివరకు 1 బిలియన్ లీటర్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు కొత్తగా 30% బ్లెండింగ్ నిబంధనలు రావడంతో మిగిలిన అదనపు ఇథనాల్‌ను కూడా చమురు కంపెనీలు పూర్తిగా కొనుగోలు చేసే అవకాశం దక్కింది. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతం ఇవ్వనుంది.

