Ethanol Revolution : భారత్‌లో సరికొత్త ఇంధన విప్లవం.. E85, E100 ఇంధనాల వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
E85, E100 ఇంధనాల వాడకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Ethanol Revolution : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ తిప్పలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో మనం పెట్రోల్ కొట్టించాల్సిన అవసరమే లేకుండా, పూర్తిగా దేశీయంగా తయారయ్యే ఇథనాల్‌తోనే బండ్లు నడిపేలా సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇప్పటికే మనం వాడుతున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (E20) కలుస్తుండగా, ఇప్పుడు దానిని ఏకంగా 85 నుంచి 100 శాతానికి పెంచేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది.
ఏమిటీ E85, E100?
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఇకపై దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల హవా పెరగనుంది. E85 అంటే అందులో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ఇక E100 అంటే అది పూర్తిస్థాయి స్వచ్ఛమైన ఇథనాల్. దీనివల్ల పెట్రోల్ వాడకం నామమాత్రంగా మారుతుంది. ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు గడలు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ముడి చమురు ఖర్చు భారీగా తగ్గుతుంది.
హైడ్రోజన్, సీఎన్‌జీ కాంబో
కేవలం ఇథనాల్ మాత్రమే కాదు, భవిష్యత్తులో వాహనాలు నడపడానికి హైడ్రోజన్, సీఎన్‌జీ మిశ్రమాన్ని వాడటంపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిని H-CNG అని పిలుస్తారు. దీనివల్ల కాలుష్యం దాదాపు సున్నా స్థాయికి పడిపోతుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై సామాన్య ప్రజలు, ఆటోమొబైల్ కంపెనీలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను చెప్పడానికి 30 రోజుల సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఫైనల్ రూల్స్ అమల్లోకి వస్తాయి.
ఎలాంటి వాహనాలకు ఇది పనికొస్తుంది?
ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. మనం ప్రస్తుతం వాడుతున్న సాధారణ పెట్రోల్ ఇంజన్లలో 100 శాతం ఇథనాల్ వాడటం కుదరదు. దీనికోసం కంపెనీలు ప్రత్యేకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయాలి. టయోటా వంటి కొన్ని కంపెనీలు ఇప్పటికే ఇలాంటి కార్లను ప్రదర్శించాయి. రాబోయే కాలంలో టీవీఎస్, బజాజ్ వంటి సంస్థలు కూడా 100% ఇథనాల్‌తో నడిచే బైకులను తీసుకురానున్నాయి. ఈ ఇంధనం పెట్రోల్ కంటే చౌకగా లభించే అవకాశం ఉండటంతో సామాన్యుడికి భారీగా డబ్బు ఆదా అవుతుంది.
లాభాలు ఎవరికి?
ఈ మార్పు వల్ల ముగ్గురికి భారీ లాభం కలుగుతుంది. మొదటిది రైతులకు.. వారు పండించిన పంట వ్యర్థాలకు మంచి ధర లభిస్తుంది. రెండోది ప్రభుత్వానికి.. చమురు దిగుమతుల కోసం విదేశాలకు పంపే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. మూడోది పర్యావరణానికి.. ఇథనాల్ వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి, తద్వారా గాలి స్వచ్ఛంగా మారుతుంది. మొత్తానికి భారత్ తన సొంత ఇంధన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి సిద్ధమైంది.

