GST Car sale: జీఎస్టీ తగ్గింపు కోసం జనం ఎదురుచూపులు.. పండుగ సీజన్‌లోనూ కారు బుక్ చేసుకోవట్లేదు!
పండుగ సీజన్‌లోనూ కారు బుక్ చేసుకోవట్లేదు!

GST Car sale: పండుగ సీజన్ ఎప్పుడూ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అత్యంత అనుకూల సమయంగా పరిగణిస్తారు. ప్రజలు కొత్త కార్లు, టూ వీలర్లను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఆటోమొబైల్ డీలర్ల ప్రకారం.. ఆగస్టు రెండో వారం నుండి బుకింగ్‌లు, షోరూమ్ సందర్శనలలో 25 శాతం వరకు తగ్గుదల నమోదైంది. వినియోగదారులు ప్రస్తుతం కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. దీనికి కారణం జీఎస్టీ (వస్తువులు సేవల పన్ను) తగ్గింపుపై ఉన్న అంచనాలే.
జీఎస్టీ రేట్లు తగ్గితే ఎంత లాభం?
ప్రస్తుతం కార్లపై 28 శాతం వరకు జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, త్వరలో ప్రభుత్వం జీఎస్టీని 18 శాతానికి తగ్గించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ఒక ఉదాహరణగా.. రూ.10 లక్షల కారుపై 10 శాతం పన్ను తగ్గితే సుమారు రూ.లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ కారణంగానే వినియోగదారులు ప్రస్తుతం వాహనాలను బుక్ చేసుకోవడానికి వెనుకాడుతున్నారు. జీఎస్టీ తగ్గింపు కోసం వేచి చూస్తున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం
అందుకున్న నివేదికల ప్రకారం.. జీఎస్టీ కౌన్సిల్ అక్టోబర్‌లో ఈ విషయంపై చర్చించే అవకాశం ఉంది. కొత్త పన్ను విధానంలో చిన్న, మీడియం రేంజ్ కార్లపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించవచ్చు. అయితే, లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్‌గా పరిగణించబడే వాహనాలపై పన్ను సుమారు 40 శాతం వరకు ఉండవచ్చు.
ఆటో మార్కెట్‌పై ప్రభావం
మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కార్ల కంపెనీలు పండుగ సీజన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలను ఆశించాయి. కానీ బుకింగ్‌లు ఆశించినంత వేగంగా జరగడం లేదు. టూ వీలర్ల కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్‌లో మంచి అమ్మకాలు ఉంటాయని ఎదురు చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పండుగల సమయంలో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈసారి ఆటో రంగం కళ తప్పినట్లు కనిపిస్తోంది.
ఒకవేళ ప్రభుత్వం త్వరలో జీఎస్టీ తగ్గింపును ప్రకటిస్తే, వినియోగదారుల విశ్వాసం పెరుగుతుంది. అమ్మకాలు ఊపందుకోవచ్చు. కానీ ఈ తగ్గింపు ఆలస్యమైనా లేదా జరగకపోయినా, ఈ పండుగ సీజన్ ఆటోమొబైల్ కంపెనీలకు ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఈ పండుగ సీజన్‌లో ఆటో ఇండస్ట్రీ ఆనందం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
