Harley Davidson: ప్రసిద్ధ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యార్లీ-డేవిడ్సన్ భారతీయ బైక్ లవర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త అడ్వెంచర్ రోడ్‌స్టర్ మోడల్‌ను తీసుకొస్తోంది. హ్యార్లీ-డేవిడ్సన్ X350T పేరుతో వస్తున్న ఈ కొత్త బైక్ భారత్‌లో ఎలాంటి కవర్లు లేకుండా రోడ్డు టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరాలకు చిక్కింది. బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌పై స్పష్టంగా కనిపించిన X350T బ్యాడ్జింగ్, కొత్త ఆరెంజ్ రంగు ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. హీరో మోటోకార్ప్‌తో కలిసి తయారు చేస్తున్న ఈ మోడల్ త్వరలోనే అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది.

కొత్త జీఎస్టీ నిబంధనలతో తగ్గుతున్న ఇంజిన్ కెపాసిటీ

దేశంలో అమలులోకి వచ్చిన కొత్త జీఎస్టీ 2.0 నిబంధనల ప్రకారం 350 సీసీ వరకు ఉన్న మోటార్ సైకిళ్లపై కేవలం 18 శాతం పన్ను పడుతుంది. అదే 350 సీసీ దాటితే ఏకంగా 40 శాతం భారీ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించడానికే హ్యార్లీ-డేవిడ్సన్ తన పాపులర్ X440T మోడల్ ఇంజిన్ పరిమాణాన్ని తగ్గించింది. 440 సీసీ స్థానంలో 350 సీసీ ఇంజిన్‌ను తీసుకొచ్చి బైక్ ధరను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ పక్కా వ్యూహం రచించింది.

స్టైలిష్ లుక్.. అడ్వెంచర్ డిజైన్

టెస్టింగ్‌లో కనిపించిన మోడల్ ఆధారంగా ఈ కొత్త బైక్ డిజైన్ చాలా మస్క్యులర్‌గా కనిపిస్తోంది. సాంప్రదాయ క్లాసిక్ రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్‌తో బైక్ లుక్ అదిరిపోయింది. లాంగ్ రైడింగ్ చేసేవారికి, రోడ్‌స్టర్ బైక్ ఇష్టపడేవారికి అనుకూలంగా ఉండేలా దీనిని డిజైన్ చేశారు. సరికొత్త ఆరెంజ్ షేడ్ బైక్‌కు మరింత స్పోర్టీ లుక్‌ని ఇస్తోంది.

ఆకట్టుకునే ఇంజిన్ పవర్.. టాప్ ఫీచర్లు

హ్యార్లీ-డేవిడ్సన్ X350Tలో దాదాపు 350 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 25 బిహెచ్‌పి పవర్, 35 ఎన్ఎమ్ టాపింగ్ టాజిని ఉత్పత్తి చేయగలదని సమాచారం. భద్రత, సులభమైన ప్రయాణం కోసం ఫ్రంట్ యుఎస్‌డి ఫోర్క్స్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆధునిక టిఎఫ్టి డిజిటల్ డిస్ప్లే లాంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు.

త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్

బజాజ్ సంస్థ కూడా జీఎస్టీ ప్రయోజనం కోసం ఇంజిన్ల సైజ్ తగ్గించినట్లే, హ్యార్లీ-డేవిడ్సన్ కూడా అదే మార్గంలో నడుస్తోంది. దీనివల్ల ప్రైస్ టాగ్ చాలా రీజనబుల్‌గా ఉండే అవకాశం ఉంది. హీరో మోటోకార్ప్ ఇప్పటివరకు అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనప్పటికీ, పండుగ సీజన్ తర్వాత లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ అడ్వెంచర్ రోడ్‌స్టర్ బైక్ భారత వీధుల్లో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story