Helmet: బైక్ లేదా స్కూటర్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అయితే చాలా మంది కేవలం ట్రాఫిక్ పోలీసుల చలాన్ల నుంచి తప్పించుకోవడానికే దీనిని వాడుతుంటారు. ఒకసారి హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత అది ఎప్పటికీ పగిలిపోయే వరకు లేదా చెడిపోయే వరకు అలాగే వాడేస్తుంటారు. కానీ బయటికి ఎలాంటి లోపాలు లేనట్లు కనిపించే పాత హెల్మెట్ ప్రమాద సమయంలో మీ ప్రాణాలను కాపాడుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్‌కు కూడా ఒక నిర్దిష్టమైన ఆయుష్షు ఉంటుందనే సత్యాన్ని ప్రతి రైడర్ తెలుసుకోవాలి.

సాధారణంగా హెల్మెట్ ఎన్నేళ్లు వస్తుంది?

అరై అలాగే షోయ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత హెల్మెట్ తయారీ సంస్థల నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక మంచి ఐఎస్‌ఐ సర్టిఫైడ్ హెల్మెట్‌ను కొనుగోలు చేసిన తర్వాత 3 నుంచి 5 సంవత్సరాల లోపు మార్చివేయడం మంచిది. ఒకవేళ హెల్మెట్ ఎటువంటి వాడకం లేకుండా సరికొత్తగా బాక్సులోనే పడి ఉన్నప్పటికీ, దాని తయారీ తేదీ నుంచి 7 సంవత్సరాలు దాటితే దాని సేఫ్టీ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ కాలం నిల్వ ఉంచిన హెల్మెట్‌లను కూడా వాడకపోవడమే సురక్షితం.

బయటికి కొత్తగా కనిపిస్తూ లోపల ఎందుకు బలహీనపడుతుంది?

హెల్మెట్ పైన కనిపించే గట్టి షెల్ మాత్రమే కాకుండా, దాని లోపల ఉండే తెల్లటి థర్మాకోల్ లాంటి పొర అత్యంత కీలకం. దీనిని ఇపిఎస్ ఫోమ్ లైనర్ అంటారు. ప్రమాదం జరిగే సమయంలో తలకు తగిలే తీవ్రమైన గాయాలను తగ్గించడంలో ఈ ఫోమ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ప్రయాణాలలో తల నుంచి వచ్చే చెమట, జిడ్డు, దుమ్ము అలాగే గాలిలో ఉండే తేమ ఈ ఫోమ్‌ను మెల్లమెల్లగా పాడుచేస్తాయి. కాలక్రమేణా ఈ ఫోమ్ గట్టిపడి కుంచించుకుపోతుంది. దీనివల్ల యాక్సిడెంట్ అయినప్పుడు షాక్‌ను అబ్సార్బ్ చేసుకునే శక్తి హెల్మెట్‌కు ఉండదు.

ఏ పరిస్థితుల్లో వెంటనే హెల్మెట్ మార్చాలి?

3 నుంచి 5 సంవత్సరాల గడువు పూర్తి కాకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితులలో హెల్మెట్‌ను వెంటనే మార్చడం అత్యవసరం. ఒకవేళ మీ హెల్మెట్‌తో కూడిన బైక్ ఏదైనా ప్రమాదానికి గురైనా, లేదా హెల్మెట్ అనుకోకుండా ఎత్తు నుంచి కింద పడి గట్టిగా తగిలినా దానిని పక్కన పెట్టేయాలి. బయటికి ఎలాంటి పగుళ్లు కనిపించకపోయినా లోపలి ఇపిఎస్ ఫోమ్ దెబ్బతిని ఉంటుంది. అలాగే తలపై హెల్మెట్ వదులుగా మారుతున్నట్లు అనిపించినా లేదా కొద్దిగా తల తిప్పినా కదులుతున్నా వెంటనే కొత్త హెల్మెట్ కొనుగోలు చేయడం ఉత్తమం.

సరైన రక్షణ కోసం చిన్న జాగ్రత్తలు

ప్రాణాలను రక్షించే ఏకైక కవచం హెల్మెట్ కాబట్టి దీని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం పనికిరాదు. నాణ్యమైన సర్టిఫైడ్ హెల్మెట్‌లను మాత్రమే ఎంచుకోవడం, దానిని నిర్ణీత కాలపరిమితి తర్వాత క్రమం తప్పకుండా మార్చడం ద్వారా ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.

Next Story