Helmet Safety:టూ వీలర్ నడిపే ప్రతీ ఒక్కరి వద్ద హెల్మెట్ ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది ఒకసారి హెల్మెట్ కొంటే అది పాడైపోయే వరకు సంవత్సరాల తరబడి దాన్నే వాడుతుంటారు. పైకి బాగుంది కదా అనుకుంటే పొరపాటే. మీ హెల్మెట్ పాతబడే కొద్దీ దాని రక్షణ సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూ వీలర్ మీద ప్రయాణించేటప్పుడు తలకు రక్షణగా ఉండే ఏకైక కవచం హెల్మెట్. సాధారణంగా కొందరు ఒక్కసారి హెల్మెట్ కొనుగోలు చేస్తే దాన్ని ఐదారేళ్ల పాటు నిరంతరాయంగా వాడుతూనే ఉంటారు. పైన ఎలాంటి పగుళ్లు లేకపోతే అది పూర్తిగా సురక్షితం అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. కాలక్రమేణా హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్, లైనింగ్ దెబ్బతింటాయి. వీటి మెత్తదనం తగ్గిపోవడం వల్ల అది తలకు సరిగ్గా అమరదు. ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే తీవ్రమైన షాక్‌ను తట్టుకునే శక్తి పాతబడిన మెటీరియల్‌కు ఉండదు.

ఐదేళ్లు దాటితే మార్చడం ఎందుకు అవసరం?

మీరు ఉపయోగిస్తున్న హెల్మెట్ కొని ఐదేళ్లకు పైబడి ఉంటే కనుక వెంటనే కొత్తది తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వాడటం వల్ల అందులోని లోపలి పొరలు వదులుగా మారతాయి. స్ట్రాప్స్ సరిగ్గా పని చేయవు. హెల్మెట్ తల పైనుంచి పక్కకు జారిపోయే అవకాశం ఉంది. రోజువారీ వాడకంలో చిన్నచిన్న దెబ్బలు తగలడం లేదా చేతిలోంచి కింద పడటం వల్ల బయట వైపు పెద్దగా డ్యామేజ్ కనిపించకపోవచ్చు. లోపల ఉండే ప్రొటెక్టివ్ లేయర్ మాత్రం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో దాన్ని వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

చిన్న ప్రమాదం జరిగినా పాతది వాడకూడదు

ఎప్పుడైనా బైక్ పైనుంచి కింద పడినప్పుడు లేదా హెల్మెట్ గట్టిగా ఏదైనా వస్తువుకు ఢీకొట్టినప్పుడు దాన్ని వెంటనే మార్చేయాలి. ఆ సమయంలో బయటి షెల్ బాగానే ఉన్నట్లు అనిపించినా, లోపలి దెబ్బతిన్న పొరలు రెండోసారి ప్రమాదం జరిగినప్పుడు ఏమాత్రం రక్షణ ఇవ్వలేవు. డబ్బులు ఆదా చేయాలనే ఆలోచనతో పాత దాన్నే వాడటం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. రహదారిపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్‌ను కేవలం ఒక వస్తువుగా కాకుండా జీవన రక్షణ సాధనంగా భావించాలి.

కొత్త హెల్మెట్‌తో భద్రతతో పాటు సౌకర్యం

ఇటీవలి కాలంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన కొత్త మోడల్ హెల్మెట్లు మార్కెట్లోకి వచ్చాయి. సరికొత్త డిజైన్లు ప్రయాణంలో గాలి బాగా ఆడేలా వెెంటిలేషన్ సదుపాయంతో లభిస్తున్నాయి. ఇవి బరువు తక్కువగా ఉండటంతో పాటు తలకు సౌకర్యవంతమైన ఫిట్టింగ్‌ను ఇస్తాయి. వీటిని ధరించడం వల్ల సుదీర్ఘ ప్రయాణాలు చేసినా అలసట రాకుండా ఉంటుంది. నాణ్యమైన ఐఎస్ఐ మార్క్ ఉన్న సరికొత్త హెల్మెట్‌ను ఎంచుకోవడం వల్ల ప్రయాణం సురక్షితంగా మారడమే కాకుండా ప్రమాదాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story