ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!

Hero : భారత మార్కెట్‌లో అత్యధిక బైక్‌లను విక్రయించే సంస్థల్లో హీరో మోటోకార్ప్ ఒకటి. ఇప్పుడు, హీరో తన 125 సీసీ మోటార్‌సైకిల్ లైనప్‌ను విస్తరిస్తూ కొత్త హీరో గ్లామర్ 125ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలలో పండుగ సీజన్‌లో ఈ బైక్ మార్కెట్‌లోకి రానుంది. ఇటీవల టెస్ట్ రన్ సమయంలో కనిపించిన ఈ కొత్త బైక్ 125 సీసీ సెగ్మెంట్‌లో ఒక కొత్త సంచలనాన్ని సృష్టించబోతోంది. దీనిలో ఉన్న ఒక ఫీచర్ ఈ సెగ్మెంట్లో మొదటిసారి వస్తుండడం విశేషం.

కొత్త హీరో గ్లామర్ 125 బైక్ కేవలం చిన్న అప్‌గ్రేడ్‌తో మాత్రమే కాకుండా, నెక్స్ట్-జనరేషన్ మోడల్‌లా కనిపిస్తోంది. కొత్త స్విచ్‌గేర్‌తో పాటు, పూర్తిగా డిజిటల్, పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో ఈ బైక్ రానుంది. దీనిలోని అత్యంత ముఖ్యమైన ఫీచర్ క్రూయిజ్ కంట్రోల్ బటన్. ఈ ఫీచర్ సాధారణంగా ప్రీమియం, హై-ఎండ్ బైక్‌లలో మాత్రమే కనిపిస్తుంది. కానీ, హీరో దీనిని 125సీసీ బైక్‌లో పరిచయం చేస్తోంది. ఇగ్నిషన్ బటన్ కింద, కుడి వైపున ఉన్న స్విచ్‌గేర్‌లో ఈ క్రూయిజ్ కంట్రోల్ టాగల్ బటన్ ఉంటుంది.

కొత్త హీరో గ్లామర్ 125 బైక్‌లో అనేక అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్‌ల కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అలాగే, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్ కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది. బైక్ రైడర్ సౌకర్యాన్ని, ప్రీమియం ఫీలింగ్‌ను పెంచడానికి, దీని డిజైన్‌లో కూడా పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఎడమవైపు ఉన్న స్విచ్‌గేర్‌లో కొత్త ఎల్‌సీడీ స్క్రీన్‌ను నావిగేట్ చేయడానికి బటన్లు ఉంటాయి. ఈ స్క్రీన్ హీరో కరిజ్మా ఎక్స్‌ఎంఆర్ 210, హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ బైక్‌లలో వాడిన యూనిట్ మాదిరిగానే ఉంటుంది.

హార్డ్‌వేర్ పరంగా చూస్తే, కొత్త హీరో గ్లామర్ 125లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది ప్రస్తుత మోడల్‌లోని అదే ఇంజిన్‌తో రానుంది. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత, ఈ కొత్త గ్లామర్ 125 ఇప్పుడు 125సీసీ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న హోండా సీబీ షైన్ బైక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో హీరో, ఈ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలను సృష్టించాలని చూస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వినియోగదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story