Hero Glamour: 125 సిసి సెగ్మెంట్లో సంచలనం.. ఏబీఎస్, టీఎఫ్‌టీ స్క్రీన్‌తో కొత్త హీరో గ్లామర్ బైక్ వచ్చేసింది
హీరో గ్లామర్ బైక్ వచ్చేసింది

Hero Glamour: దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తన అత్యంత ప్రజాదరణ పొందిన గ్లామర్ బైక్‌ను సరికొత్త హంగులతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఏబీఎస్ (ABS) టెక్నాలజీతో కూడిన హీరో గ్లామర్ ఎక్స్ 125 మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 65 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ బైక్ వివరాలు చూద్దాం. 125 సిసి బైక్ విభాగంలో మైలేజ్ మాత్రమే కాకుండా రైడర్ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హీరో ఈ మోడల్‌ను డిజైన్ చేసింది. కొత్త గ్లామర్ ఎక్స్ 125 మోడల్‌లో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో పాటు ఇంటెగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS) సదుపాయం కల్పించారు. అకస్మాత్తుగా బ్రేకులు వేసినప్పుడు ముందు చక్రం లాక్ కాకుండా ఈ ఏబీఎస్ కాపాడుతుంది. దీనికి తోడు ఐబీఎస్ టెక్నాలజీ వల్ల ముందు, వెనుక బ్రేకులు సమతుల్యంగా పనిచేసి బైక్‌పై పూర్తి నియంత్రణ సాధించేందుకు వీలవుతుంది. అత్యవసర సమయాల్లో ఇతర వాహనదారులను అప్రమత్తం చేసేందుకు పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ లాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
క్రూయిజ్ కంట్రోల్, పవర్ఫుల్ ఇంజిన్
ఈ కొత్త మోడల్‌లో 124.7 సిసి సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 11.4 బిహెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడర్ సౌకర్యం కోసం ఈ బైక్‌లో ఈకో, రోడ్, పవర్ అనే మూడు వేర్వేరు రైడింగ్ మోడ్లు ఇచ్చారు. ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా క్రూయిజ్ కంట్రోల్ లాంటి ప్రత్యేక ఫీచర్‌ను జోడించడం విశేషం. లాంగ్ డ్రైవ్‌లలో వేగాన్ని స్థిరంగా ఉంచి హాయిగా ప్రయాణించడానికి ఇది ఉపయోగపడుతుంది. కంపెనీ అంచనాల ప్రకారం ఈ బైక్ లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
డిజిటల్ స్మార్ట్ ఫీచర్లు.. టీఎఫ్‌టీ స్క్రీన్
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇష్టపడే యువత కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టీఎఫ్‌టీ (TFT) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను అమర్చారు. మొబైల్ కనెక్ట్ చేయడం ద్వారా స్క్రీన్‌పైనే టర్న్-బై-టర్న్ నేవిగేషన్, కాల్స్, ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్లు చూడవచ్చు. అలాగే డిస్‌ప్లేపై రియల్ టైమ్ మైలేజ్ ఇండకేటర్, గేర్ షిఫ్ట్ అడ్వైజరీ, డిస్టెన్స్-టూ-ఎంటి వంటి విలువైన సమాచారం క్షణాల్లో కనిపిస్తుంది. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ద్వారా ప్రయాణంలోనే మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు.
ధరలు, రంగుల వివరాలు
ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ వద్ద హీరో గ్లామర్ ఎక్స్ 125 ఏబీఎస్ వేరియంట్ ధరను రూ.1.01 లక్షలుగా నిర్ణయించారు. ప్రామాణిక డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 88,517 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్‌ను గన్ మెటల్ గ్రే, మ్యాట్ ఆక్సిస్ గ్రే, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

