Hero Vida : రికార్డు క్రియేట్ చేసిన హీరో కొత్త స్కూటర్.. జులైలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే సేల్స్
జులైలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే సేల్స్

Hero Vida : భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్న హీరో మోటోకార్ప్ జూలై నెలలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా అమ్మకాలతో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒకే నెలలో ఏకంగా 10,489 విడా స్కూటర్లను విక్రయించింది. 2022లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక నెలలో 10,000 యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే మొదటిసారి. జూలై 2025లో హీరో విడా అమ్మకాలు గతేడాది ఇదే నెలతో (జూలై 2024లో 5,067 యూనిట్లు) పోలిస్తే 107 శాతం పెరిగాయి. అలాగే, గత రికార్డును (మార్చి 2025లో 8,040 యూనిట్లు) కూడా సులభంగా దాటింది. ఈ గణనీయమైన అమ్మకాల వృద్ధి కారణంగా గత నెలలో మొత్తం 1.02 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవగా, అందులో 10 శాతం మార్కెట్ వాటాను హీరో మోటోకార్ప్ సాధించింది.
2025 సంవత్సరం హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక రికార్డు ఇయర్ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం జనవరిలో కేవలం 1,626 యూనిట్లు అమ్ముడవగా, జూలై నాటికి ఈ సంఖ్య 10,489కి చేరింది. అంటే కేవలం ఏడు నెలల్లో 545 శాతం వృద్ధి నమోదైంది. ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణం ఇటీవల విడుదలైన అత్యంత చౌకైన విడా మోడల్ విడా వీఎక్స్2. హీరో మోటోకార్ప్ జూలై 2న తమ అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీఎక్స్2ను విడుదల చేసింది. ప్రారంభంలో దీని ధర రూ. 99,490గా ఉన్నప్పటికీ, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ కింద బ్యాటరీ ధరను మినహాయించి కేవలం రూ. 59,490కి లభించేలా చేశారు. దీనికి తోడు విడుదలైన కేవలం 7 రోజుల్లోనే కంపెనీ దీని ధరను రూ. 15,000 తగ్గించింది. దీంతో ఈ స్కూటర్ ధర రూ. 44,490కి చేరింది.
ఈ ధరలో ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో 142 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇంత తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లభించడంతో వినియోగదారులు దీనిని కొనడానికి మొగ్గు చూపుతున్నారు. జనవరి నుంచి జూలై 2025 వరకు హీరో విడా మొత్తం అమ్మకాలు 43,885 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది ఇప్పటికే గత సంవత్సరం (2024లో 43,710 యూనిట్లు) అమ్మకాలను దాటింది. ఇంకా ఈ ఏడాది పూర్తి కావడానికి ఐదు నెలలు సమయం ఉంది. ప్రస్తుతం ఉన్న అమ్మకాల వేగం చూస్తుంటే ఈ సంవత్సరం హీరో మోటోకార్ప్ తొలిసారిగా లక్ష యూనిట్ల వార్షిక అమ్మకాల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
