Hero MotoCorp : భారతీయ టూవీలర్ మార్కెట్‌లో హీరో అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మరోసారి నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 2026లో కళ్లు చెదిరే అమ్మకాలను నమోదు చేసింది. కేవలం 30 రోజుల్లోనే లక్షల సంఖ్యలో బైక్‌లను విక్రయించి, ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. పాత కాలపు పెట్రోల్ బైక్‌ల నుంచి ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు హీరో హవా మామూలుగా లేదు.

హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 2026లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఒక్క నెలలోనే మొత్తం 5.66 లక్షల యూనిట్లను డెలివరీ చేసి సత్తా చాటింది. గత ఏడాదితో పోలిస్తే ఇది భారీ వృద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్ విభాగంలో మహమ్మారి తర్వాత అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. ఎంట్రీ లెవల్ బైక్‌ల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ప్రతి చోటా కస్టమర్లు హీరో వైపే మొగ్గు చూపారు. కంపెనీ తన నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా మరింత విస్తరించడం ఈ విజయానికి ప్రధాన కారణమైంది.

హీరోకు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ విడా ఇప్పుడు ఇళ్లల్లో ప్రాచుర్యం పొందుతోంది. ఏప్రిల్ నెలలో విడా అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 129 శాతం పెరిగాయి. విడా VX2 స్కూటర్‌పై ఒక అభిమాని ఏకంగా 10,500 కిలోమీటర్లు ప్రయాణించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో చోటు సంపాదించడం ఈ స్కూటర్ల నాణ్యతకు నిదర్శనం. రైడ్ జిత్నా.. పే ఉత్నా (ఎంత వాడితే అంతే కట్టండి) అనే సరికొత్త బ్యాటరీ సర్వీస్ మోడల్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌తో హీరో కుదుర్చుకున్న ఒప్పందం పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. 6 for 6 పేరుతో చేపట్టిన ఈ క్యాంపెయిన్ ప్రకారం.. కేకేఆర్ ప్లేయర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు ప్రతిఫలంగా నగరంలో ఒక 6kW ఫాస్ట్ ఛార్జర్‌ను హీరో ఏర్పాటు చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా బ్రాండ్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. అలాగే యువతను ఆకట్టుకోవడానికి ఇషాన్ ఖట్టర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి హీరో జూమ్ స్కూటర్ కోసం చేపట్టిన ప్రచారాలు కూడా మంచి ఫలితాలను ఇచ్చాయి.

కేవలం ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా హీరో తన పట్టును పెంచుకుంటోంది. ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో తన వ్యాపారాన్ని విస్తరించడానికి క్విల్ మోటార్స్ అనే కంపెనీతో హీరో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల విదేశీ ఎగుమతులు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో స్ప్లెండర్ వంటి మోడళ్లు, ఇటు నగరాల్లో విడా, జూమ్ స్కూటర్లు.. ఇలా హీరో మోటోకార్ప్ మార్కెట్‌లో తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story