Hero : భారతీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ అంతర్జాతీయ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశీయంగా ఎంతో పాపులర్ అయిన తన అడ్వంచర్ మోటార్‌సైకిల్ సిరీస్‌ను ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. యూరప్ దేశాలలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా కంపెనీ అక్కడ హీరో ఎక్స్‌పల్స్ 200 4V, హీరో ఎక్స్‌పల్స్ 200 ప్రో బైక్‌లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ వంటి ఐరోపా దేశాలలో అడుగుపెట్టిన హీరో.. ఇప్పుడు యూకే బైక్ లవర్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. పూర్తిగా మేడ్ ఇన్ ఇండియాగా రూపుదిద్దుకున్న ఈ బైక్‌లు ఇప్పుడు లండన్ వీధుల్లో సందడి చేయనున్నాయి.

బ్రిటన్‌లోని అత్యంత ప్రసిద్ధ ఆఫ్-రోడ్ ప్రదేశమైన రిబల్ వ్యాలీలో హీరో కంపెనీ ఈ బైక్‌లను అట్టహాసంగా ఆవిష్కరించింది. దట్టమైన అడవులు, నదులు దాటే ట్రాక్‌లు, కఠినమైన రాతి దారులతో కూడిన ఈ ప్రాంతం అడ్వంచర్ బైక్‌ల టెస్టింగ్‌కు పెట్టింది పేరు. హీరో మోటోకార్ప్ గత 2025లోనే మోటోజీబీ అనే స్థానిక సంస్థతో చేతులు కలిపి యూకే మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ సరికొత్త అడ్వంచర్ సిరీస్‌తో అక్కడ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని చూస్తోంది. లాంగ్ రైడ్స్, ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఈ బైక్‌లు ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలవనున్నాయి.

లిమిట్‌లెస్ అడ్వంచర్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఎక్స్‌పల్స్ సిరీస్‌ను హీరో రూపొందించింది. సిటీ రోడ్లపై సాఫీగా సాగిపోవడంతో పాటు, ఎలాంటి గతుకుల రోడ్లనైనా ఇట్టే అధిగమించేలా వీటిని తయారు చేశారు. అయితే కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బేస్ వేరియంట్ 4V, టాప్ వేరియంట్ ప్రోల మధ్య కంపెనీ కొన్ని కీలకమైన మార్పులను చేసింది. బరువు, సీటు ఎత్తు, సస్పెన్షన్ పరంగా రెండు బైక్‌లు వేర్వేరు ఫీలింగ్‌ను ఇస్తాయి.

మొదటి వేరియంట్ అయిన హీరో ఎక్స్‌పల్స్ 200 4V ధరను యూకే మార్కెట్లో GBP 2,699 (భారత కరెన్సీలో సుమారు రూ.3.50 లక్షలు) గా నిర్ణయించారు. ఈ బైక్ బరువు కేవలం 159 కిలోగ్రాములు మాత్రమే ఉండటం వల్ల దీనిని హ్యాండిల్ చేయడం చాలా సులభం. దీని సీటు ఎత్తు 825 మిమీగా ఉంటుంది. తక్కువ బరువుతో ఉండి, రోజువారీ సిటీ ప్రయాణాలతో పాటు వారాంతాల్లో చిన్న చిన్న ట్రిప్పులు వేయాలనుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.

ఇక కఠినమైన సాహసాలు చేయాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన హీరో ఎక్స్‌పల్స్ 200 ప్రో ధర GBP 2,899 (మన కరెన్సీలో సుమారు రూ.3.76లక్షలు)గా ఉంది. దీని బరువు 161 కిలోలుగా ఉంటుంది. ఇందులో రైడర్‌కు మంచి గ్రిప్ ఇచ్చేలా ఎత్తైన హ్యాండిల్‌బార్, పెద్ద గేర్ లివర్, 891 మిమీ ఎత్తైన సీటును అమర్చారు. ఎలాంటి అడ్డంకులనైనా దాటడానికి వీలుగా ఇందులో ముందర 250mm, వెనుక 220mm అడ్జస్టబుల్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. దీనివల్ల కారుకు ఉన్నంత రేంజ్‌లో ఏకంగా 270mm భారీ గ్రౌండ్ క్లీయరెన్స్ ఈ బైక్‌కు లభించింది.

ఫీచర్ల విషయానికి వస్తే రెండు బైక్‌లలోనూ అడ్వాన్స్‌డ్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. రాత్రి వేళల్లో అడవుల్లో ప్రయాణించేటప్పుడు దారి స్పష్టంగా కనిపించేలా ఇందులో క్లాస్-డి ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌తో పాటు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను ఇచ్చారు. ఇది పాత లైట్ల కంటే ఏకంగా 230 శాతం ఎక్కువ వెలుతురును ఇస్తుంది. అదనంగా బైక్ కింద భాగం దెబ్బతినకుండా బాష్ ప్లేట్, చేతులకు రక్షణగా హ్యాండ్ గార్డ్స్, లగేజ్ పెట్టుకోవడానికి బంజీ హుక్స్‌తో కూడిన ప్లేట్‌ను అమర్చారు.

ఈ రెండు మోడళ్లలోనూ శక్తివంతమైన 199.6cc సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8,500 rpm వద్ద 18.9 hp పవర్‌ను, 6,500 rpm వద్ద 17.35 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో మూడు రకాల ఏబీఎస్ (ABS) మోడ్‌లను ఇచ్చారు. రెండు బైక్‌లలోనూ ముందర 276mm డిస్క్ బ్రేక్, వెనుక 220mm డిస్క్ బ్రేక్ ఉండటం వల్ల ఎంత వేగంలో ఉన్నా బైక్ వెంటనే కంట్రోల్‌లోకి వస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story