Hero Splendor: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారికి హీరో మోటోకార్ప్ షాక్ ఇచ్చింది. కంపెనీ ఈ బైక్‌లోని అన్ని వేరియంట్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ప్రభావం ఎక్కువగా స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌పై పడింది. దీని ధర ఏకంగా రూ.3,086 పెరిగింది. అయితే ధరలు పెరిగినప్పటికీ బైక్ ఇంజిన్‌లో గానీ, మెకానికల్‌గా గానీ ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం వేరియంట్ పేరులో మార్పుతో పాటు కొత్త రంగులు, ఫీచర్ల ఎంపికను మాత్రమే కస్టమర్లకు అందిస్తోంది.

బేస్ డ్రమ్, ఐ3ఎస్, స్పెషల్ ఎడిషన్ కొత్త ధరలు ఇవే

ప్రస్తుతం స్ప్లెండర్ ప్లస్ బైక్ నాలుగు ప్రధాన వేరియంట్లలో (Splendor Plus, Flex, XTEC, XTEC 2.0) లభిస్తోంది. వీటిలో బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ.1,135 పెరిగి, రూ.77,777 నుంచి రూ.78,912కు చేరింది. i3S వేరియంట్ ధర కూడా అంతే మొత్తం పెరిగి రూ.78,910 నుంచి రూ.80,045కు పెరిగింది. గతంలో బ్లాక్ అండ్ యాక్సెంట్ పేరుతో పిలిచే స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ధర అత్యధికంగా రూ.3,086 పెరిగి రూ.78,580 నుంచి రూ.81,666కు చేరింది. అలాగే 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.1,135 పెరిగి రూ.80,531 నుంచి రూ.81,666 అయింది.

మూడు కొత్త రంగులు.. డిస్క్ బ్రేక్ ఎందులో ఉందంటే?

ధరల పెంపుతో పాటు స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌లో కంపెనీ మూడు కొత్త రంగులను చేర్చింది. అవి మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్. మిగతా వేరియంట్లన్నీ పాత రంగుల్లోనే లభిస్తాయి. ఇక బ్రేకింగ్ వ్యవస్థ విషయానికి వస్తే.. నాన్-ఎక్స్‌టెక్ మోడళ్లన్నింటిలో ముందు వైపు డ్రమ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ కస్టమర్లకు మెరుగైన బ్రేకింగ్ కంట్రోల్ కావాలంటే మాత్రం ఎక్స్‌టెక్ (XTEC) వేరియంట్ తీసుకోవాల్సిందే, ఎందుకంటే మొత్తం లైనప్‌లో ఫ్రंट్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ కేవలం ఇందులో మాత్రమే ఉంది.

ఎక్స్‌టెక్, ఎక్స్‌టెక్ 2.0 వేరియంట్ల రేట్లు, ఫీచర్లు

స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ డ్రమ్ బ్రేక్ మోడల్ ధర ఇప్పుడు రూ.82,418 కాగా, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మోడల్ ధర రూ.85,461గా నిర్ణయించారు. ఇందులో అనలాగ్-డిజిటల్ మీటర్, బ్లూటూత్ కాల్-SMS అలర్ట్‌లు, రియల్-టైమ్ మైలేజ్ చూపించే ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు ఎక్స్‌టెక్ కంటే పై స్థాయిలో ఉండే ఎక్స్‌టెక్ 2.0 కేవలం డ్రమ్ బ్రేక్‌తో మాత్రమే వస్తుంది, దీని ధర రూ.84,549. ఇందులో హాలోజన్ లైట్ స్థానంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇండికేటర్లలో హజార్డ్-లైట్ ఫీచర్ అదనంగా ఇచ్చారు.

ఇథనాల్ ఫ్లెక్స్ మోడల్ ధర కూడా పెంపు

ఇథనాల్ ఇంధనంతో నడిచే స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ధరను కూడా రూ.1,332 పెంచారు. రూ.82,710 వద్ద లాంచ్ అయిన ఈ బైక్ ఇప్పుడు రూ.84,042కు చేరింది. అయితే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ మాత్రం ఇంకా పాత లాంచ్ ధర రూ.72,792 వద్దే అందుబాటులో ఉంది. ఈ స్ప్లెండర్ ఫ్లెక్స్ మోడల్ E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుంది. E85 ఇంధనంతో 8.6 hp పవర్, 8.3 Nm టార్క్ ఇస్తుండగా, E20పై 8.02 hp పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Next Story