Hero Splendor : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో హీరో మోటోకార్ప్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. జూన్ 2026 నాటి సేల్స్ నివేదికల ప్రకారం, దేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా హీరో స్ప్లెండర్ మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గడిచిన 30 రోజుల్లోనే ఏకంగా 3,36,856 మంది కస్టమర్లు ఈ బైక్‌ను కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే స్ప్లెండర్ విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదైంది. విశేషమేమిటంటే.. హీరో కంపెనీ సాధించిన మొత్తం అమ్మకాల్లో ఒక్క స్ప్లెండర్ వాటానే దాదాపు 67 శాతంగా ఉండటం దాని క్రేజ్‌కు అద్దం పడుతోంది.

కమ్యూటర్ బైక్స్ సేల్స్.. గ్లామర్, ఎక్స్‌పల్స్ జోరు

కంపెనీకి చెందిన ఇతర మోడళ్ల అమ్మకాలను పరిశీలిస్తే.. హెచ్‌ఎఫ్ డీలక్స్ 44,292 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. సూపర్ స్ప్లెండర్ 16,168 యూనిట్లు, ప్యాషన్ 15,290 యూనిట్ల విక్రయాలను నమోదు చేశాయి. అయితే హీరో గ్లామర్ ఏకంగా 63 శాతం వార్షిక వృద్ధితో 14,027 యూనిట్ల సేల్స్ సాధించి ఆకట్టుకుంది. అలాగే ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైక్ 25 శాతం పెరుగుదలతో 2,957 యూనిట్లు అమ్ముడైంది. ఎక్స్‌ట్రీమ్ 125R మాత్రం 13,220 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

ప్రీమియం విభాగాలు, హార్లీ-డేవిడ్సన్ ఊపు!

హీరో మరియు హార్లీ-డేవిడ్సన్ భాగస్వామ్యంలో వచ్చిన ప్రీమియం మోడల్ హార్లీ-డేవిడ్సన్ X440 మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతోంది. జూన్ నెలలో ఈ బైక్ ఏకంగా 69 శాతం వార్షిక వృద్ధితో 1,197 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రీమియం విభాగంలో హీరో తన పట్టును వేగంగా విస్తరిస్తోందనడానికి ఈ విక్రయాలే నిదర్శనం.

స్కూటర్లు, విడా ఈవీ విప్లవం!

ఇక స్కూటర్ విభాగంలో డెస్టినీ 125 22,010 యూనిట్ల విక్రయాలతో హీరో పోర్ట్‌ఫోలియోలోనే టాప్‌లో నిలిచింది. ప్లెజర్ స్కూటర్ 7,121 యూనిట్లు అమ్ముడవగా.. హీరో జూమ్ స్కూటర్ ఏకంగా 595 శాతం సంచలన వృద్ధితో 6,741 యూనిట్ల సేల్స్ సాధించింది. ఇటీవల లాంచ్ అయిన కొత్త జూమ్ 160 కూడా 1,458 యూనిట్లు అమ్ముడైంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో హీరో విడా స్కూటర్లు 184 శాతం గ్రోత్‌తో 20,416 యూనిట్ల సేల్స్ సాధించి ఈవీ మార్కెట్లో దుమ్మురేపాయి. సాధారణ బైక్‌లతో పాటు స్కూటర్లు, ఈవీ రంగంలోనూ హీరో దూసుకుపోతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story