EV Cars : కొత్త కారు కొనేవాళ్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో 3 కొత్త ఈవీ ఎస్‌యూవీలు
అదిరిపోయే రేంజ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో 3 కొత్త ఈవీ ఎస్‌యూవీలు

EV Cars : దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చాలా వేగంగా దూసుకుపోతోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా, కాలుష్యం లేని ప్రయాణంతో పాటు అత్యాధునిక సాంకేతికతను అందించేందుకు టాటా, కియా, హోండా కంపెనీలు సరికొత్త ఈవీ కార్లతో రెడీ అయ్యాయి. రాబోయే రోజుల్లో లాంగ్ రేంజ్ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ ఫీచర్లతో మూడు సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇండియన్ మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి.
టాటా సియెర్రా ఈవీ
టాటా మోటార్స్ తన మోస్ట్ అవైటెడ్ ఐకానిక్ మోడల్ టాటా సియెర్రా ఈవీని జూన్ 30న అధికారికంగా లాంచ్ చేయనుంది. 4.3 మీటర్ల పొడవుతో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో రానున్న ఈ కారు హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా BE6 కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. క్లాసిక్ సియెర్రా డిజైన్ గుర్తుకు తెచ్చేలా పనోరమిక్ రియర్ గ్లాస్ ఏరియా, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, క్లామ్‌షెల్ టెయిల్‌గేట్లతో పాటు క్లోజ్డ్ గ్రిల్, ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్ దీని సొంతం. ఈ కారును హారియర్ ఈవీ తరహాలోనే ప్రసిద్ధ Acti.EV+ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. ఇందులో 65kWh నుంచి 75kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇది సింగిల్, డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్‌తో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించనుంది.
కియా సిరోస్ ఈవీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. ఈ ఏడాది ఆగస్టులోనే తన అత్యంత చిన్న మరియు అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు కియా సిరోస్ ఈవీని మార్కెట్లోకి తెస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV 3XO ఈవీల మార్కెట్‌ను దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఈ కారు అడుగుపెడుతోంది. పెట్రోల్ మోడల్ లాగే K1 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి వస్తున్న ఈ ఈవీ కారులో హ్యుందాయ్ ఇన్‌స్టర్ గ్లోబల్ మోడల్ తరహాలోనే 42kWh, 49kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు. ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వచ్చే ఈ కారులో వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) చార్జింగ్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
హోండా జీరో ఆల్ఫా
జపనీస్ కార్ల దిగ్గజం హోండా.. 2027 ప్రారంభంలో పూర్తి సరికొత్త ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన జీరో ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారును రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో పూర్తి దేశీయంగా తయారు చేయనున్నారు. ఇందులో 65kWh మరియు 75kWh బ్యాటరీ ప్యాక్‌లను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇవి సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల అద్భుతమైన రియల్ వరల్డ్ రేంజ్‌ను ఇస్తాయి. కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 19-ఇంచ్ వీల్స్, లోపల ఫ్లాట్ ఫ్లోర్ కేబిన్, హెక్సాగోనల్ స్టీరింగ్ వీల్ వంటి లగ్జరీ ఫీచర్లతో వస్తున్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 17 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

